Telugu Global
Cinema & Entertainment

"F2 " సినిమా రివ్యూ

రివ్యూ: F2 రేటింగ్‌:  2.75/5 తారాగణం: వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌,  ప్రకాష్‌ రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌ నిర్మాత: దిల్‌ రాజు దర్శకత్వం:  అనిల్‌ రావిపూడి టాలీవుడ్ లో ఈ సారి కాస్త భారీ ఎత్తున కనిపించిన సంక్రాంతి యుద్ధంలో చివరిగా వచ్చిన సినిమా ఎఫ్2. రెండేళ్ల తర్వాత వెంకటేష్ నటించిన మూవీ కావడంతో పాటు మెగా హీరో వరుణ్ తేజ్ జోడి కట్టడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ట్రైలర్ వచ్చాక ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ […]

F2  సినిమా రివ్యూ
X

రివ్యూ: F2
రేటింగ్‌: 2.75/5
తారాగణం: వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌, ప్రకాష్‌ రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
నిర్మాత: దిల్‌ రాజు
దర్శకత్వం: అనిల్‌ రావిపూడి

టాలీవుడ్ లో ఈ సారి కాస్త భారీ ఎత్తున కనిపించిన సంక్రాంతి యుద్ధంలో చివరిగా వచ్చిన సినిమా ఎఫ్2. రెండేళ్ల తర్వాత వెంకటేష్ నటించిన మూవీ కావడంతో పాటు మెగా హీరో వరుణ్ తేజ్ జోడి కట్టడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ట్రైలర్ వచ్చాక ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు దీని మీద మంచి గురి ఉంది. పోటీ గట్టిగా ఉన్నప్పటికీ దిల్ రాజు మాత్రం దీని మీద ముందు నుంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

వెంకీ (వెంకటేష్) ఎమ్మెల్యే (రఘుబాబు) దగ్గర పిఏగా పని చేస్తుంటాడు. కాస్త లేట్ అయినా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హారిక (తమన్నా)ను మ్యారేజ్ బ్యూరో ద్వారా చూసి పెళ్లి చేసుకుంటాడు. హారిక చెల్లి హనీ(మెహ్రీన్)ని వరుణ్(వరుణ్ తేజ్) ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్ళి దాకా తీసుకొస్తాడు.

అయితే వెంకీ లైఫ్ లో పెళ్లి తర్వాత తలెత్తిన ఫ్రస్ట్రేషన్ వల్ల ఈ ఇద్దరు కలిసి పొరుగింటాయన (రాజేంద్ర ప్రసాద్)తో కలిసి ఎవరికీ తెలియకుండా యూరోప్ చెక్కేస్తారు. వీరి జాడ కోసం వెతుకుతున్న హారిక, హనీలు నాన్న స్నేహితుడు దొరైస్వామినాయుడు (ప్రకాష్ రాజ్) సహాయంతో అక్కడికి వచ్చి ఓ నాటకం మొదలుపెడతారు. కొంత గందరగోళం మొదలవుతుంది. ఫైనల్ గా ఏమవుతుంది అనేది తెలుగు ప్రేక్షకుడు ఎవరైనా ఊహించేదే.

నలుగురు సీనియర్ అగ్ర హీరోల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న వెంకటేష్ బలమంతా తన కామెడీ టైమింగ్ లో ఉంది. చాలా కాలంగా దర్శకులు దాన్నెలా ఉపయోగించుకోవాలో తెలియక కథలతో మెప్పించలేక సైలెంట్ అయ్యారు. కానీ అనిల్ రావిపూడి లాంటి మంచి కామిక్ సెన్స్ ఉన్న డైరెక్టర్ దొరకడంతో వెంకటేష్ రెచ్చిపోయాడు. కామెడీ పరంగా తన బెస్ట్ ఇచ్చాడు. ఇంత ఏజ్ లోనూ తనలో క్యాలిబర్ తగ్గలేదు అని నిరూపించేలా ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. తెరనిండా ఆర్టిస్టులు ఉన్నా వెంకీ నటనతో ఆడుకున్న తీరు అందరిని సైడ్ చేసేసింది.

వరుణ్ తేజ్ అంతరిక్షంతో పోల్చుకుంటే ఇది చాలా రెట్లు నయం. తెలంగాణ యాసతో వెరైటీగా ఏదో ట్రై చేసాడు కానీ అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. తమన్నా బాగుంది. వెంకీ లాంటి సీనియర్ హీరో పక్కన చాలా చిన్నదిగా ఎబ్బెట్టుగా అనిపించకుండా ఓకే అయ్యింది.

మెహ్రీన్ ఇంకాస్త సీరియస్ గా నటన మీద దృష్టి పెడితే బెటర్. అయినా గతంలో వచ్చిన వాటితో పోలిస్తే బెటర్. ప్రగతి, ప్రదీప్, ఝాన్సీ, సత్యం రాజేష్, సుబ్బరాజు, శ్రీనివాసరెడ్డి, హరితేజ, వెన్నెల కిషోర్ లిస్ట్ పెద్దదే ఉంది. ప్రకాష్ రాజ్ ది రొటీన్ పాత్రే. రాజేంద్ర ప్రసాద్ వృధా అయ్యాడు.

దర్శకుడు అనిల్ రావిపూడి కథలో ప్రత్యేకత ఏమి లేదు. ఈ లైన్ తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే కథనంతో మెప్పించే టాలెంట్ పుష్కలంగా ఉన్న అనిల్ రావిపూడి తన బలమైన కామెడీ సెన్స్ తో సన్నివేశాలను చక్కగా రాసుకోవడంతో నవ్వులు బాగా పేలాయి.

వెంకీ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు రాసుకున్న ప్రతి సీన్ బాగా పేలింది. ఇంటర్వెల్ దాకా నాన్ స్టాప్ గా ఫన్ సాగుతూనే ఉంటుంది. అయితే అసలు చిక్కు సెకండ్ హాఫ్ నుంచి మొదలవుతుంది. పెద్దగా కథ చెప్పే అవకాశం లేకపోవడంతో ప్రకాష్ రాజ్ ఎపిసోడ్ తీసుకున్న అనిల్…. దాన్ని అంత ఎంటర్ టైనింగ్ గా డీల్ చేయలేకపోవడంతో మొదట్లో వచ్చిన ఫీల్ క్రమంగా తగ్గుతూ పోతుంది. అయినా కూడా ఇదేంటి ఇలా ఉంది అనిపించకుండా…. సినిమా మొత్తం ఒకే టెంపోలో ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ కలుగుతుంది.

మాస్ పల్స్ ని పసిగట్టి ఎక్కడ నవ్వించాలో ఎక్కడ కిక్ ఇవ్వాలో బాగా తెలిసిన అనిల్ ఇందులో పూర్తి విద్యను ప్రదర్శించలేకపోయాడు. అయినా కూడా ఇది బెటర్ గానే అనిపించింది అంటే దానికి కామెడీ ఒక్కటే కారణం. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోకపోవడం మంచిది. ఏదో రెమ్యునరేషన్ ఇచ్చారో లేదో అనేలా తీసికట్టు ట్యూన్స్ ఇచ్చాడు. సమీర్ రెడ్డి కెమెరా పనితనం బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ లోపాలేమి పెద్దగా లేవు. దిల్ రాజు ప్రొడక్షన్ ఓకే.

ఇక ఎఫ్2 గురించి ఒక్క మాటలో చెప్పాలంటే టైటిల్ కు తగ్గట్టే ఫస్ట్ హాఫ్ లో బోలెడు ఫన్ తో పాటు సెకండ్ హాఫ్ లో ఫ్రస్ట్రేషన్ కూడా కలిగి ఉంది. అయితే ప్రేక్షకుడికి కావాల్సిన సగటు వినోదం ఉంది కాబట్టి ఈ సంక్రాంతి సినిమాల్లో ఇదే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

ఏదో టైం పాస్ కు సినిమాకు వెళ్లి బుర్రకు ఎక్కువ పని చెప్పకుండా ఎంజాయ్ చేసేవాళ్లకు ఎఫ్2 బాగుంటుంది.

ఎఫ్2 – వెంకీ మార్కు నవ్వులు

First Published:  12 Jan 2019 6:30 PM GMT
Next Story