వినయ విధేయ నుంచి…. ఆ సీన్ లేపేశారు

మొత్తానికి రామ్ చరణ్ కు ఎట్టకేలకు ఓ చిన్న రిలీఫ్ దొరికింది. ప్రేక్షకులకు ఓ మంచి కామెడీ మిస్ అయింది. అవును.. వినయ విధేయ రామ సినిమా నుంచి దాదాపు 24 గంటలుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఓ సన్నివేశాన్ని మేకర్స్ యుద్ధప్రాతిపదికన తొలిగించారు. ఈ సన్నివేశం కారణంగా ఇప్పటికే పరువు పోగొట్టుకున్న చరణ్ ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నాడు

వినయ విధేయ రామలో రామ్ చరణ్ ట్రయిన్ పై వెళ్లే ఓ సీన్ ఉంది. విజువల్ గా ఆ సీన్ బ్రహ్మాడంగా ఉంటుంది. కానీ లాజికల్ గా చూస్తే అది పరమ చెత్త సన్నివేశం. గుజరాత్ లోని ద్వారక పట్టణం నుంచి నేపాల్ బోర్డర్ వరకు రామ్ చరణ్ అలా ట్రయిన్ పై నిల్చొని వెళ్లే సన్నివేశం అది. ఏమైనా అర్థం ఉందా ఆ సీన్ లో? అందుకే సోషల్ మీడియాలో ఆ సన్నివేశం ట్రోల్ అయింది.

తమ సెల్ ఫోన్లలో ఆ సీన్ ను బంధించిన చాలామంది ప్రేక్షకులు.. సోషల్ మీడియాలో ఆ సీన్ పెట్టి రచ్చ రచ్చ చేశారు. దీంతో ఆఘమేఘాల మీద ఆ సన్నివేశాన్ని తొలిగించారు. అయితే ఏమనుకున్నారో ఏమో సి-సెంటర్ల వద్ద మాత్రం ఆ సన్నివేశాన్ని యథాతథంగా ఉంచేశారు. ఈ సన్నివేశం సంగతి పక్కనపెడితే.. సినిమా రిజల్ట్ దెబ్బకు యూనిట్ కు చెందిన వ్యక్తులెవరూ బయటకు రావడం మానేశారు.