Telugu Global
NEWS

భారత్ కు ఇలాంటి క్రికెటర్లు అవసరమా?

హర్మన్ ప్రీత్ కౌర్ అలా…పాండ్యా, రాహుల్ ఇలా! పురుషులు, మహిళలూ దొందూ దొందే! నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ తో హర్మన్ ప్రీత్ కౌర్ హిట్ వికెట్.. మహిళలంటే గౌరవం లేని పాండ్యా, రాహుల్ క్రికెట్ అంటే పెద్దమనుషుల ఆట. మర్యాదస్తుల క్రీడ. అయితే…ఎంతో ఔన్నత్యం కలిగిన జెంటిల్మన్ గేమ్ కు నేటితరం భారత క్రికెటర్లు తలవంపులు తెస్తున్నారు. పురుషుల, మహిళలు అన్న తేడా లేకుండా అనుచితంగా ప్రవర్తిస్తూ తమకు ఎనలేని గౌరవప్రతిష్టలను తెచ్చి పెట్టిన క్రీడనే నవ్వులపాలు చేస్తున్నారు.  […]

భారత్ కు ఇలాంటి క్రికెటర్లు అవసరమా?
X
  • హర్మన్ ప్రీత్ కౌర్ అలా…పాండ్యా, రాహుల్ ఇలా!
  • పురుషులు, మహిళలూ దొందూ దొందే!
  • నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ తో హర్మన్ ప్రీత్ కౌర్ హిట్ వికెట్..
  • మహిళలంటే గౌరవం లేని పాండ్యా, రాహుల్

క్రికెట్ అంటే పెద్దమనుషుల ఆట. మర్యాదస్తుల క్రీడ. అయితే…ఎంతో ఔన్నత్యం కలిగిన జెంటిల్మన్ గేమ్ కు నేటితరం భారత క్రికెటర్లు తలవంపులు తెస్తున్నారు. పురుషుల, మహిళలు అన్న తేడా లేకుండా అనుచితంగా ప్రవర్తిస్తూ తమకు ఎనలేని గౌరవప్రతిష్టలను తెచ్చి పెట్టిన క్రీడనే నవ్వులపాలు చేస్తున్నారు.

క్రికెట్ క్రేజీ భారత్ లో…. పెద్దమనుషుల క్రీడ క్రికెట్ కాస్త అల్లరిచిల్లరి క్రీడలా తయారయ్యింది. చదువుకోక ముందు కాకరకాయ, చదువుకొన్న తర్వాత కీకరకాయ అన్నట్లుగా పరిస్థితి మారింది.

క్రికెట్ అంటే మర్యాద, క్రికెట్ అంటే హుందాగా ఉండటం. అయితే ఈ పదాలకు నేటితరం భారత క్రికెటర్లు అర్ధం మార్చేస్తున్నారు. మోసం, దగా, అర్థంపర్థం లేని వాగుడుతో క్రికెట్ గౌరవాన్నే మంటకలిపేస్తున్నారు. ఆడమగా అన్నతేడా లేకుండా తమకు అన్నంపెట్టి, సమాజంలో ఉన్నతస్థితిని తెచ్చిపెట్టిన క్రీడతోనే వికృత ఆట ఆడుతున్నారు.

నవతరం క్రికెటర్లు ఎందుకిలా…?

కర్నల్ కఠారి కనకయ్యనాయుడు, మన్సూర్ అలీఖాన్ పటౌడీ, ఎమ్ఎల్ జయసింహా, గుండప్ప విశ్వనాథ్, కపిల్ దేవ్, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి ఎందరో జెంటిల్మన్ క్రికెటర్లను అందించిన భారత్ లో…ఇప్పుడు హార్థిక్ పాండ్యా, రాహుల్, హర్మన్ ప్రీత్ కౌర్ లాంటి వెర్రిపోకడల క్రికెటర్లు వికటాట్టహాసం చేస్తున్నారు.

నాటితరం క్రికెటర్లతో పోల్చిచూస్తే నేటితరం క్రికెటర్లకు…అంతగా శ్రమించకుండానే, సంవత్సరాల తరబడి వేచిచూడకుండానే అవకాశాలు, వివిధ రూపాలలో కోట్లరూపాయలు వచ్చిపడుతున్నాయి.

దీంతో…తమను పెంచిపెద్ద చేసిన ఆటను మించిపోయి మతిమాలిన పనులు చేసి…కోరికష్టాలు కొనితెచ్చుకొంటున్నారు.

పాండ్యా, రాహుల్ ..ఇదేమి సంస్కారం?

టీమిండియా యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, యువ ఓపెనర్ కెఎల్ రాహుల్ ప్రతిభ అపారంగా ఉన్నా , వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నా బీసీసీఐ వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ వస్తోంది. అవకాశం వెంట అవకాశం ఇచ్చి ఆదరిస్తోంది. అయినా…ఈ ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్ తో వచ్చిన నడమంత్రపు సిరితో దారి తప్పారు. అమ్మాయిలను ఆట వస్తువులుగా చూస్తూ నవ్వులపాలయ్యారు.

ఇటీవలే ప్రసారమైన .. కాఫీ విత్ కరణ్ షోలో పాండ్యా, రాహుల్… యువతులు, మహిళల పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా …సోషల్ మీడియాకు చిక్కారు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. బీసీసీఐ సస్పెన్షన్ వేటుతో జట్టులో చోటు కోల్పోయారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో జరిగే వన్డే సిరీస్ ల్లో పాల్గొనే జట్ల లో స్థానం పోగొట్టుకొన్నారు.

క్షమాపణలు కోరినా సస్పెన్షన్….

బీసీసీఐ పాలకమండలి నుంచి షోకాజ్ నోటీసులు అందిన వెంటనే పాండ్యా, రాహుల్ క్షమాపణలు కోరారు. క్రికెట్ అభిమానులకు, నెటిజన్లకు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు.

కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో పాల్గొన్న హార్థిక్ పాండ్యా…మహిళలను, ప్రధానంగా యువతులను కించ పరుస్తూ.. వ్యాఖ్యలు చేశాడు. అమ్మాయిలను కించపరిచేవిధంగా మాట్లాడటమే కాదు.. సెక్సిస్ట్, ఉమెన్ హేటర్ లాంటి పదాలను ఉపయోగిస్తూ కొన్ని కామెంట్స్ చేశాడు.

తల్లిదండ్రులతో కలిసి తాను ఓ పార్టీకి వెళ్లిన విషయాన్ని.. తనకు ఎంతమంది యువతులతో సంబంధాలు ఉన్నదీ, తాను బ్రహ్మచర్యాన్నికోల్పోయిన రోజున…. ఆ విషయాన్ని అమ్మానాన్నలకు ఎలా చెప్పానన్న విషయాన్నీ …షోలో పాండ్యా వివరించి చెప్పాడు. దీంతో.. అతనిపై తీవ్ర స్థాయిలో నెటిజన్లు మండిపడ్డారు.

మరోవైపు..హార్థిక్ పాండ్యా, రాహుల్ లను వివరణతోనే సరిపెట్టకుండా బీసీసీఐ కఠినంగా శిక్షంచాలని…అంతర్జాతీయ క్రికెటర్లు ఎంత హుందాగా ఉండాలో తెలిసేలా చేయాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు.

హార్థిక్ పాండ్యా, రాహుల్ లాంటి నేటితరం క్రికెటర్లను చూస్తే…క్రికెటర్లంతా పోకిరీల్లానే ఉంటారని భావించే ప్రమాదం ఉందని…మాస్టర్ సచిన్, ద్రావిడ్ లాంటి క్రికెటర్లకు ఇది తలవంపులు తీసుకురావడమేనంటూ.. భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మండిపడుతున్నాడు.

హవ్వా!…. హర్మన్ ప్రీత్…..

క్రీడాకారులు…ప్రధానంగా క్రికెటర్లు నిజాయితీ పరులంటే గుడ్డిగా నమ్మే రోజులకు కాలం చెల్లింది. మహిళా క్రికెటర్లు సైతం అడ్డదారులు తొక్కడానికి వెనుకాడరనడానికి నిదర్శనమే భారత మహిళా క్రికెట్ టీ-20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వివాదం.

నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ తో పంజాబ్ పోలీస్ శాఖలో డీఎస్పీ ఉద్యోగం సంపాదించిన…హర్మన్ ప్రీత్ కౌర్ ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటోంది. తగిన అర్హత లేకుండానే…దొంగ సర్టిఫికెట్ తో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించినట్లు పంజాబ్ పోలీస్ శాఖ విచారణలో దోషిగా తేలింది.

కోట్ల ఆదాయం ఉన్నా అడ్డదారిలో…

హర్మన్ ప్రీత్ కౌర్…ఈ పేరు వినగానే 2017 మహిళా ప్రపంచకప్ సెమీఫైనల్, 2018 మహిళా టీ-20 ప్రపంచకప్ గ్రూప్ లీగ్ మ్యాచ్ ల్లో సాధించిన మెరుపు సెంచరీలే గుర్తుకు వస్తాయి.

పంజాబ్ లోని మోగా నుంచి భారత మహిళా క్రికెట్లోకి దూసుకొచ్చిన 28 ఏళ్ల హర్మన్ ప్రీత్ కౌర్ కు..ప్రస్తుత ప్రపంచ మహిళా క్రికెట్లోనే హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్ విమెన్ గా గుర్తింపు ఉంది. అంతేకాదు.. వన్డే క్రికెట్లో భారత వైస్ కెప్టెన్ గా…టీ-20 ఫార్మాట్లో భారత కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తోంది.

అంతేకాదు….ఆస్ట్రేలియా దేశవాళీ మహిళా టీ-20 బిగ్ బాష్ లీగ్ లో..భారీ కాంట్రాక్టుపై గత మూడుసీజన్లుగా ఆడుతున్న భారత ఏకైక మహిళా క్రికెటర్ గా కూడా హర్మన్ ప్రీత్ కు గుర్తింపు ఉంది. ప్రొఫెనషల్ క్రికెటర్ గా ఇప్పటికే వివిధ రూపాలలో కోట్ల రూపాయలు ఆర్జించింది.

రైల్వేస్ టు పంజాబ్ పోలీస్….

దేశవాళీ మహిళా క్రికెట్లో నిలకడగా రాణించమే కాదు..భారీ షాట్లతో విరుచుకుపడే బాట్స్ విమెన్ గా పేరున్న హర్మన్ ప్రీత్… ముంబై కేంద్రంగా పనిచేసే వెస్టర్న్ రైల్వేస్ లో… సాధారణ ఉద్యోగిగా చేరి అంచెలంచెల ప్రమోషన్లతో ఆఫీస్ సూపరింటెండెంట్ స్థాయికి ఎదిగింది.

అంతేకాదు…ఐదేళ్ల బాండ్ కుదుర్చుకొంది. ఒకవేళ ఐదేళ్లకు ముందే ఉద్యోగం మారదలచుకొంటే….ఐదుసంవత్సరాల జీతం 27 లక్షల రూపాయలు కడతానంటూ సంతకం పెట్టింది. మూడేళ్లపాటు రైల్వేస్ ఉద్యోగంలోనే కొనసాగుతూ వచ్చింది.

ప్రపంచకప్ తో పోలీస్ ఉద్యోగం…

ఇంగ్లండ్ వేదికగా ముగిసిన 2017 మహిళా ప్రపంచకప్ సెమీఫైనల్లో హర్మన్ ప్రీత్ 171 పరుగుల సంచలన స్కోరు సాధించడంతోనే… ఆమె దశ తిరిగింది. హర్మన్ ప్రీత్ కు పంజాబ్ పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగం ఇస్తామంటూ అక్కడి రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది.

డీఎస్పీ ఉద్యోగం కోసం హర్మన్ ప్రీత్ …రైల్వేస్ లో ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయితే…బాండ్ ప్రకారం ఐదేళ్ల జీతం 27 లక్షల రూపాయలు కట్టాలంటూ రైల్వేస్ నుంచి తాఖీదు అందింది. దీంతో… హర్మన్ ప్రీత్ పరిస్థితి కక్కలేక..మింగలేక అన్నట్లుగా తయారయ్యింది.

కొద్దినెలలుగా డీఎస్పీ ఉద్యోగంలో చేరకుండానే కాలంగడచిపోతూ ఉండడంతో లోలోన ఆందోళన ప్రారంభమయ్యింది. ఈ పరిస్థితి నుంచి హర్మన్ ప్రీత్ ను గట్టెక్కించడానికి స్వయానా.. పంజాబ్ ముఖ్యమంత్రే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

రైల్వేబోర్డ్ వరమిచ్చినా…!

మరోవైపు…తమ ఉద్యోగిగా ఉన్న హర్మన్ ప్రీత్ రాజీనామాకు తాము ఎప్పుడో ఆమోదం తెలిపామని….ఉన్నతస్థాయి ఉద్యోగంలో చేరతానంటే తాము అవరోధాలు కల్పించబోమని…బాండ్ ప్రకారం… ఐదేళ్లకు బదులు …రెండేళ్ల జీతం చెల్లిస్తే సరిపోతుందని….రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ కార్యదర్శి వివరణ ఇచ్చారు.

ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రయివేటు టోర్నమెంట్ బిగ్ బాష్ లీగ్ లో పాల్గొనటానికి…హర్మన్ ప్రీత్ ఐదుమాసాలు సెలవు తీసుకొందని…తాము నిరభ్యంతర సర్టిఫికెట్ ఇచ్చామని..లాభసాటి లీగ్ లో ఆడుతున్న ఉద్యోగికి జీతం ఎలా ఇస్తామని ప్రశ్నించారు.

రెండుసంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించడం హర్మన్ ప్రీత్ కు ఏమాత్రం కష్టం కాదని….హర్మన్ ప్రీత్ స్థాయికి అది చాలా తక్కువ మొత్తమేనని రైల్వేస్ స్పష్టం చేసింది. అయితే..పంజాబ్ ముఖ్యమంత్రి, కేంద్రరైల్వే మంత్రి, ఇతర ప్రముఖుల ఒత్తిడి తో రైల్వే బోర్డు…హర్మన్ ప్రీత్ ను కరుణించి విడిచి పెట్టింది. దీంతో…పంజాబ్ పోలీస్ శాఖలో డీఎస్పీగా చేరటానికి మార్గం సుగమమయ్యింది.

మూణ్ణాళ్ల ముచ్చటగా డీఎస్పీ ఉద్యోగం…

రైల్వే శాఖ ఉద్యోగానికి రాజీనామా చేసిన హర్మన్ ప్రీత్ కౌర్…ఆ తర్వాత పంజాబ్ పోలీస్ శాఖలో డీఎస్పీగా చేరింది. పంజాబ్ ముఖ్యమంత్రి దగ్గరుండి మరీ…హర్మన్ ప్రీత్ ను డీఎస్పీ ఉద్యోగంలో చేర్పించారు.

ఆ తర్వాత కొద్ది మాసాలకే…పోలీసు ఉద్యోగాలలో చేరిన అభ్యర్ధుల అర్హతలు, డిగ్రీ సర్టిఫికెట్ల పరిశీలనలో….హర్మన్ ప్రీత్ అడ్డంగా దొరికిపోయింది. డిగ్రీ చదవకుండానే…నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ తో డీఎస్పీ ఉద్యోగంలో చేరినట్లు విచారణలో తేలింది.

నకిలీ సర్టిఫికెట్ తో అసలుకే ఎసరు…

12వ తరగతి వరకు మాత్రమే చదివిన హర్మన్ ప్రీత్….మీరట్ లోని చౌదరీ చరణ్ సింగ్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసినట్లుగా ఓ పట్టా సంపాదించింది. అయితే ..పోలీసు శాఖ విచారణలో ఆ పట్టా నకిలీదని…హర్మన్ ప్రీత్ అస్సలు డిగ్రీనే చదవలేదని తేలింది.

ఈ విషయాన్ని హర్మన్ ప్రీత్ కు తెలిపిన తర్వాత…డిఎస్పీ ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే…హర్మన్ ప్రీత్ ఓ మహిళ కావటం… పైగా భారత టీ-20 కెప్టెన్ కావడంతో ఆమెపై ఎలాంటి చర్య తీసుకోరాదని పంజాబ్ పోలీస్ నిర్ణయించింది. అంతేకాదు… హర్మన్ ప్రీత్ కౌర్ కు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది.

ఏదిఏమైతేనేం…క్రికెట్ ద్వారా అవార్డులు, రివార్డులు ,కోట్ల రూపాయలు సంపాదించిన హర్మన్ ప్రీత్ కౌర్…డిగ్రీ నకిలీ సర్టిఫికెట్ తో భారత క్రీడాకారుల పరువు తీసింది. దేశానికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తులు అడ్డదారులు తొక్కితే.. తప్పులు చేస్తే అవి ఏమాత్రం ఒప్పులు కాబోవని ప్రభుత్వాలు, బీసీసీఐ గుర్తించాలి.

బీసీసీఐ ద్వంద్వ ప్రమాణాలు…

నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ తో డీఎస్పీ ఉద్యోగం సంపాదించి..ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న హర్మన్ ప్రీత్ కౌర్ ను…భారత మహిళా జట్టులో సభ్యురాలిగా, టీ-20 కెప్టెన్ గా కొనసాగిస్తున్న బీసీసీఐ… మరోవైపు…హార్థిక్ పాండ్యా, రాహుల్ లాంటి క్రికెటర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చి, సస్పెన్షలో ఉంచి…జట్టు నుంచి తొలగించడం ఎంతవరకూ సబబని క్రికెట్ విమర్శకులలోని ఓవర్గం ప్రశ్నిస్తున్నారు.

ఆడవారైనా…మగవారైనా తప్పు చేస్తే శిక్ష ఒకటేనన్న వాస్తవాన్ని బీసీసీఐ పెద్దలు ముందుగా గుర్తించాలని…హర్మన్ ప్రీత్ కౌర్, పాండ్యా, రాహుల్ లాంటి విపరీతపోకడల క్రికెటర్ల అవసరం భారత క్రికెట్ కు అసలు ఉందా? అన్న విషయం గురించి ఆలోచించాలని చెబుతున్నారు. క్రికెట్ కంటే క్రికెటర్లు ఏమాత్రం గొప్పవారు కాదని…మర్యాదస్తుల క్రీడ క్రికెట్ మర్యాద కాపాడని క్రికెటర్లకు…రాం రాం చెప్పినా తప్పులేదని అంటున్నారు.

హర్మన్ ప్రీత్ కౌర్ లాంటి దొంగపోలీస్ పంజాబ్ పోలీస్ శాఖకు, భారత మహిళా క్రికెట్ కూ అవసరమో…కాదో తేల్చుకోవాలి. క్రీడాకారులైనా…క్రికెటర్లయినా స్ఫూర్తి ప్రదాతలుగా ఉండాలి.

అయితే…హర్మన్ ప్రీత్ కౌర్ లాంటి క్రికెటర్లను చూస్తే…ఆటలో వారు సాధించిన పరుగులు,రికార్డుల కంటే…నకిలీ సర్టిఫికెట్లు, డిఎస్పీ ఉద్యోగం కోసం అడ్డదారులు తొక్కిన తీరే అభిమానులకు గుర్తుకు వస్తాయి.

ఇప్పటికే అర్జున పురస్కారం పొందిన హర్మన్ ప్రీత్ నుంచి…ఆ అవార్డును వెనక్కితీసుకొన్నా అది ఏమాత్రం తప్పుకాదు.

First Published:  15 Jan 2019 5:00 AM GMT
Next Story