ఆనాటి సంక్రాంతి సంబరాలేవి?

సూర్యుడు…. ఆ వేళ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దాన్ని సంక్రాంతి అంటారు. అప్పటి నుంచి ఆరు నెలలు ఉత్తరాయణం. మిగతా ప్రాంతాలు నాకు తెలీదు కానీ మా వైపు (విశాఖ జిల్లా) పెద్ద పండుగ అని అంటారు. ఏ పండగకు లేనంత హడావిడి.

నెల ముందు దేవుడి గుళ్ళో “నెల గంట” అని పెడతారు. అప్పట్నించి అందరూ పండుగకి ఏర్పాట్లు ప్రారంభిస్తారు. ఆరోజు నుంచి రోజూ ఏదో ఒక దేవుడ్ని ఊరేగిస్తారు. పాపం! ఎందుకో శివుణ్ణి ఊరేగించరు.

ప్రతి ఇంటి దగ్గర ఆడవాళ్ళు పళ్ళెంలో బియ్యం, దక్షిణ, దీపం పట్టుకొని నిల్చునేవారు. అప్పటి దేవుళ్ళంతా బీద వాళ్ళే. వాళ్ళకి రథాలు ఏం లేవు. ఓ చిన్న పల్లకిలో విగ్రహం పెట్టి, పక్కన దీపం పెట్టి ఇద్దరు మోసేవారు. పూజారి పక్కనే నడుస్తాడు. మనం ఇచ్చిన బియ్యం పల్లకీలోనే ఓ పక్కనున్న బస్త్రాలో పోసి, దక్షిణ మొలలో దోపుకొని మన చేతిలో రెండు పువ్వులు పెడతాడు.

ఔనూ! దేవుడికి బియ్యం ఎందుకూ? అడిగితే తిడతారు. తరువాత తెలిసింది. ఆ బియ్యంతోనే పూజారి బతకాలి. అతను పాపం దేవుణ్ణే నమ్ముకున్నాడు మరి. మనం మామూలు రోజుల్లో వెళ్ళి “ఏమండీ! ఈ బియ్యం వండుకోండి” అని ఇవ్వం కదా! అదీ సంగతి.

ఇంతకీ దేవుడు మాత్రం ఏం చేస్తాడు? అతనికే దిక్కులేదు. పూజారి ఒక పాత పంచె కడతాడు. అప్పటి దేవుళ్ళంతా బీదవాళ్ళే. ఒక్క భద్రాచలం రాముడు తప్ప. అదైనా రామదాసు నగలు జేయించాడు కాబట్టి. మరి ఇప్పుడు? దేవుళ్ళు పక్కా క్యాపిటలిస్టులు. విగ్రహం కనిపించదు. పై నుంచి కింద వరకు నవరత్నాలున్నవే. పట్టుబట్టలు, ఊరేగింపుకి బ్రహ్మాండమైన రథాలు. అలనాడు కేవలం పూజారి తిండి కోసం దేవుడు రోడ్డుమీద ఊరేగాడు.

ఆ నెల రోజులూ ప్రతి రోజూ హరి దాసు నెత్తి మీద మిలమిల మెరిసే రాగి పాత్ర పెట్టుకొని ఏవో పాడుతూ వస్తాడు. ప్రతి వాళ్ళు ఎంతో కొంత బియ్యం వేస్తారు.

గంగిరెద్దు వాళ్ళు సన్నాయి వాయిస్తూ వస్తారు. వాళ్ళకి బియ్యం, డబ్బు, పాత బట్టలు ఏవి ఇచ్చినా పుచ్చుకుంటారు.

కొమ్మ దాసరి

ఇంక ఓ గమ్మతైన వాడు ఉన్నాడు. వాడు నేల మీద అడుక్కోడు. ప్రతి పెరట్లోను పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఏదో ఒక ఇంటి చెట్టెక్కి కూర్చుని నేలమీద ఓ గుడ్డ పరుస్తాడు. అక్కడ్నించి “ఓ అమ్మ, ఓ అయ్యా” అని గట్టిగా అరవడం ప్రారంభిస్తాడు. వాడ్ని ”కొమ్మ దాసరి” అనేవారు.

అలా రోజుకొక వీధిలో అడుక్కుంటాడు. పాపం! ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారో! ఏమౌతారు నావెర్రి గాని. కూలీలు గానో, ముష్టి వాళ్ళు గానో మారిపోతారు.

ముగ్గులు పోయి టాటూలు వచ్చాయి

ఇక ముగ్గులు…. ఆ నెలంతా వీధి గుమ్మంలోనూ రోడ్డు మీదే కళ్ళాపు (నీళ్ళలో పేడ కలిపి) జల్లి, ఆ తరువాత ముగ్గులు పెట్టేవారం. రోజుకో రకం ముగ్గు. తెల్లవారుజామున లేచి, ఆ చలిలో ముగ్గు పెట్టడం సరదాగా ఉండేది.

ఇప్పుడు ముగ్గులు లేవు? ఇంటి ముందు ముగ్గు పోయి, ఒంటిమీద టాటూలు వచ్చాయి. మరి మనం మెడ్రన్‌ కదా.

కుంకుమపోయి…. స్టిక్కర్లు వచ్చాయి

పైగా అపార్టు మెంట్ల కల్చర్‌ వచ్చాక వీధి గుమ్మం ఎక్కడుంది? అసలు గుమ్మాలే లేవు. అప్పుడు అన్ని గుమ్మాలకీ పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టే వాళ్ళం. ఇప్పుడు అసలు మెహానే కుంకుమ లేదు. స్టిక్కరు తప్ప…. అన్పట్టు కుంకుమ అంటే గుర్తొచ్చింది. పండుగ ముందు పసుపు కొమ్ములను కొని, పసుపు, కుంకుమ ఏడాదికి సరిపోయేటట్టు దంపించే వారు. ఎవరూ పసుపు, కుంకుమ కొనరు.

సంక్రాంతినాటికి ప్రతి ఇంటిలో పసుపు, కుంకుమ, ఖర్జూరం, పంచదార చిలకలు పంచడం ఆచారం. ఎప్పుడూ వచ్చినా, రాకపోయినా, సంక్రాంతికి మాత్రం కూతురు, అల్లుడు ఉంటే మనవళ్ళు మనువరాళ్ళు తప్పని సరిగా వస్తారు. వాళ్ళందరికీ కొత్త బట్టలు పెట్టడం సంప్రదాయం.

పండగకి వారం, పదిరోజుల ముందే ఇంటికి ముస్తాబు ప్రారంభం. పూరిల్లు అయితే పేడ, మట్టి కలిపి ఇళ్ళంతా అలికి, చక్కగా ముగ్గులు పెడితే ఎంత అందంగా ఉంటుందో ఊహించగలరా? పెంకుటిళ్ళు అయితే సున్నం వేయించడం అదో పెద్ద యజ్ఞం.

సున్నపు బట్టీ నుంచి సున్నపు రాళ్ళు తెచ్చి, పెరట్లో పెద్ద పాత్రలో వేసి నీళ్లు పోస్తే అవి అన్నం ఉడికినట్టు కుత కుత ఉడుకుతాయి. తరువాత కావాలసిన నీళ్ళు కలిపి గోడలకి వేస్తారు. సున్నం వేసే వాళ్ళని ముందుగానే బుక్‌ చేసుకోవాలి. వాళ్ళు వేసి వెళ్లిపోతారు. కానీ మనకి ఒళ్ళు హూనం అయిపోతుంది. సామాను బైట పెట్టి, లోపల పెట్టి…. పిల్లల ఒళ్ళంతా సున్నమే..!

పువ్వుల చెట్లు నడుస్తున్నట్టు ఉండేది

భోగి, సంక్రాంతి. ఈ రెండు రోజులూ ఆడవాళ్ళకి చేతినిండా పనే. రోజంతా పొయ్యి దగ్గరే. పిండి వంటలు చెయ్యడం తోనే సరిపోయేది. కూతురికిష్టం అని ఒకటి, కొడుక్కి ఇష్టమని మరొకటి అలా చేస్తూనే ఉంటుంది తల్లి…. ఏ పిల్లకి ఏం ఇష్టమో తల్లికి తెలుసు. తల్లికి ఏదిష్టమో పిల్లలకి తెలీదు. అదీ తమాషా.

ఇప్పుడు సంక్రాంతి వస్తోంది. కాని ఏ ఇంటా ముగ్గులేదు. పిండివంటలు లేవు. స్వగృహ వాళ్ళు ఏ పండుగకి అవసరమైన పిండి వంటలు ఆ పండుగకి అమ్ముతారు. ఆఖరికి ఆడపిల్లని అత్తారింటికి పంపేటప్పుడు పెట్టే చలివిడి కూడా అమ్ముతున్నారు.

ఇప్పటి తరానికి ఆచారం తెలుసుగాని చెయ్యడం రాదు. ఆనాటి ఆడపిల్లలు పండుగ నాడు పరికిణి కట్టుకొని, జెడ వేసుకుని, జెడ గంటలు వేసుకొని, పువ్వులు పెట్టుకొని వెళ్తూ ఉంటే పువ్వుల చెట్లు నడుస్తున్నట్టు ఉండేది.

మరి ఇప్పుడు చిన్న, పెద్ద అని లేదు. ఏ ఆడదానికి జడలేదు. జుత్తు వీరబోసుకొని ఓ క్లిప్పు పెట్టుకోవడం. మరింక పువ్వులెందుకూ? ఇంకా లేటెస్టు ఫ్యాషన్‌ ఆ క్లిప్పు కూడా లేకుండా వదిలెయ్యడం. అదే అందం అనుకుంటే ఎవరూ ఏం చెయ్యలేరు.

అసలు ఇప్పటి సంక్రాంతి చూస్తే బాధేస్తుంది. ఆనాటి ముచ్చట్లు ఏవి? ఆసరదా, ఆ సంతోషం ఎక్కడ? అందుకే ఏనాడో అన్నారు “గత కాలము మేలు…. వచ్చు కాలము కంటేన్‌” అని….. అది అక్షరాలా నిజం!

ఆనాడు అలా బతికిన వాళ్ళం. ఈ నాడు ఇలా బతకడం కష్టమే మరి. కాని చచ్చే దాకా బతకాలి కదా! తప్పదు.

– బీనా దేవి