Telugu Global
Cinema & Entertainment

రిటైర్మెంట్ ఎప్పుడు రజనీకాంత్?

రజనీకాంత్.. సౌత్ లోనే కాదు, ఆలిండియాలో తిరుగులేని నటుడు. కలలో కూడా సాధ్యం కాని స్టయిల్స్, ఫైట్స్ ఎవరు చేసినా నవ్వుతాం. కానీ రజనీకాంత్ చేస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే అతడు సూపర్ స్టార్. రజనీ స్టార్ డమ్ అలాంటిది. ఇండస్ట్రీలో ఎంతమంది సూపర్ స్టార్స్ ఉన్నప్పటికీ ఆ బిరుదుకు సిసలైన బ్రాండ్ అంబాసిడర్ మాత్రం రజనీకాంత్. అయితే క్రేజ్ అనే ఆ కోటకు ఇప్పుడు బీటలు వారుతోంది. రజనీకాంత్ ఇమేజ్ తగ్గుతుందనే విషయం అందరికీ తెలుస్తూనే […]

రిటైర్మెంట్ ఎప్పుడు రజనీకాంత్?
X

రజనీకాంత్.. సౌత్ లోనే కాదు, ఆలిండియాలో తిరుగులేని నటుడు. కలలో కూడా సాధ్యం కాని స్టయిల్స్, ఫైట్స్ ఎవరు చేసినా నవ్వుతాం. కానీ రజనీకాంత్ చేస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే అతడు సూపర్ స్టార్. రజనీ స్టార్ డమ్ అలాంటిది. ఇండస్ట్రీలో ఎంతమంది సూపర్ స్టార్స్ ఉన్నప్పటికీ ఆ బిరుదుకు సిసలైన బ్రాండ్ అంబాసిడర్ మాత్రం రజనీకాంత్.

అయితే క్రేజ్ అనే ఆ కోటకు ఇప్పుడు బీటలు వారుతోంది. రజనీకాంత్ ఇమేజ్ తగ్గుతుందనే విషయం అందరికీ తెలుస్తూనే ఉంది. కానీ ఈ పొంగల్ సాక్షిగా రజనీకాంత్ హవా తగ్గిందనే విషయం కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రుజువైంది. ఈమధ్య కాలంలో పెద్దగా బాక్సాఫీస్ రికార్డులు లేకపోయినా, సోలో రిలీజ్ కారణంగా తన హవా నిలబెట్టుకుంటూ వచ్చాడు రజనీ. కానీ ఈసారి రజనీ సినిమాతో పాటు అజిత్ సినిమా వచ్చింది.

ఒకేసారి థియేటర్లలోకి వచ్చిన ఈ రెండు సినిమాల్లో రజనీ చేసిన పెట్టా సినిమా కంటే అజిత్ నటించిన విశ్వాసం సినిమా ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంది. కలెక్షన్లలో కూడా ఆ తేడా స్పష్టంగా కనిపించింది. పెట్టా సినిమా కంటే విశ్వాసం మూవీకి అత్యధికగా వసూళ్లు వస్తున్నాయి.మరికొన్ని గంటల్లో ఈ సినిమా తమిళనాట 50 కోట్ల మార్క్ కూడా అందుకోబోంది.

ఈ ఒక్క సినిమాతో రజనీ మ్యానియా తగ్గిందని ఓ అభిప్రాయానికి వచ్చేయడం తప్పే అవుతుంది. కానీ రజనీ క్రేజ్ తగ్గిందని చెప్పడానికి పెట్టాను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడం లేదు విశ్లేషకులు. రజనీకాంత్ నటించిన గత సినిమాల లెక్కల్ని కూడా తీస్తున్నారు. గతంలో సిసలైన సూపర్ స్టార్ ఇమేజ్ తో కొనసాగుతున్న టైమ్ లో రజనీకాంత్ చేసిన ఫ్లాప్ సినిమాలు కూడా వసూళ్ల వర్షం కురిపించాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాబా. ఆ సినిమా ఓ డిజాస్టర్. కానీ ఇతర హీరోలు కుళ్లుకునేలా వచ్చాయి కలెక్షన్లు.

బాబా ఒక్కటే కాదు.. ఆ టైమ్ లో రజనీకాంత్ నటించిన ఫ్లాప్ సినిమాలు కూడా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లను నిరాశపరచలేదు. అలాంటి రజనీకాంత్ నుంచి ఇటీవల వచ్చిన సినిమాలు అతడి స్టామినాను చెప్పకనే చెబుతున్నాడు. యానిమేషన్ చిత్రంగా కొచ్చడయాన్ చేస్తే కనీసం ఫ్యాన్స్ కూడా చూడలేదు. ఇక లింగ సినిమా అయితే అతిపెద్ద డిజాస్టర్. కెరీర్ స్టార్టింగ్ లో నష్టాలొస్తే పంపిణీదారులను ఆదుకున్న రజనీకాంత్, వరుసగా ఫ్లాపులు రావడంతో ఆ దిశగా కూడా ఆలోచించడం మానేశాడు.

రజనీకాంత్ సినిమాలకు ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా ఉండొచ్చు. ఇంతవరకు కాదనలేం. కానీ రజనీ స్టార్ డమ్ కు, అతడి సినిమాలకు పెట్టిన బడ్జెట్ తో పోల్చి చూస్తే ఈ ఓపెనింగ్స్ ఏ మూలకు రావు. ఫలితంగా కబాలి లాంటి సినిమాలు ఓపెనింగ్స్ కే పరిమితమయ్యాయి తప్ప, రజనీ స్టామినాను ఎలివేట్ చేయలేకపోయాయి. ఇక కాలా అయితే ఆమాత్రం ఓపెనింగ్స్ కు కూడా నోచుకోలేదంటే రజనీ కెరీర్ గ్రాఫ్ పై ఓ అంచనాకు రావొచ్చు.

ఇవన్నీ ఒకెత్తయితే 2.O మరో ఎత్తు. ఇండియాలోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కింది ఈ సినిమా. ఒకప్పటి రజనీకాంత్ అయితే పెట్టిన పెట్టుబడికి రెండింతలు లాభం రావాలి. కానీ 2.O సినిమా ఆడియన్స్ తో పాటు నిర్మాతల్ని కూడా నిరాశపరిచింది. ఒకదశలో బాహుబలిని కొట్టేస్తుందని భావించిన ఈ సినిమా, వారం తర్వాత పూర్తిగా చతికిలపడిపోయింది.

రజనీకాంత్ కు కోట్లలో అభిమానులు ఉండొచ్చు. ముఖం ముడతలు పడినా, ఫైట్స్-డాన్స్ చేయడానికి కష్టంగా అనిపించినా రజనీకాంత్ స్టయిల్ అంటే ఫ్యాన్స్ పడిచచ్చిపోతారు. కానీ అదొక్కటి ఉంటే చాలదు, ఫ్యాన్ బేస్ తో పాటు ప్రేక్షక లోకం కూడా థియేటర్లకు రావాలి. అప్పుడే సినిమా సేఫ్ వెంచర్ అవుతుంది. పొంగల్ ఫీవర్ లో పెట్టా సినిమా హౌజ్ ఫుల్ కలెక్షన్లలో నడుస్తుండొచ్చు. కానీ అది రజనీ రియల్ స్టామినా కాదు. రికార్డుల కోసం రజనీకాంత్ పరుగెత్తే వయసు కాదిది, రిటైర్మెంట్ తీసుకొని పరిశ్రమకు ఓ పెద్ద దిక్కుగా నిలవాల్సిన సమయం. ఈ విషయాన్ని “సూపర్ స్టార్” ఎప్పుడు గ్రహిస్తాడో!

First Published:  15 Jan 2019 7:34 AM GMT
Next Story