Telugu Global
NEWS

పండుగలేదు... గాలిపటం ఎగురలేదు

సంక్రాంతి రోజున తీవ్ర విచారంలో హార్థిక్ పాండ్యా ఇంటిలోనే బంధీగా మారిన కుర్ర ఆల్ రౌండర్ బీసీసీఐ నిషేధంతో అయోమయంలో హార్థిక్ పాండ్యా పెద్దల మాటలు చద్దన్నపు మూటలు అని ఊరికే అనలేదు. పిల్లకాకి ఏంతెలుసు వుండేలు దెబ్బ అన్నమాట… టీమిండియా కుర్ర ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు అతికినట్లు సరిపోతుంది. కాఫీ విత్ కరణ్ షోలో వెకిలిగా మాట్లాడటం ద్వారా కోరి కష్టాలు కొనితెచ్చుకొన్న 25 ఏళ్ల హార్ధిక్ పాండ్యా తనకు ఎంతో ఇష్టమైన సంక్రాంతి […]

పండుగలేదు... గాలిపటం ఎగురలేదు
X
  • సంక్రాంతి రోజున తీవ్ర విచారంలో హార్థిక్ పాండ్యా
  • ఇంటిలోనే బంధీగా మారిన కుర్ర ఆల్ రౌండర్
  • బీసీసీఐ నిషేధంతో అయోమయంలో హార్థిక్ పాండ్యా

పెద్దల మాటలు చద్దన్నపు మూటలు అని ఊరికే అనలేదు. పిల్లకాకి ఏంతెలుసు వుండేలు దెబ్బ అన్నమాట… టీమిండియా కుర్ర ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు అతికినట్లు సరిపోతుంది.

కాఫీ విత్ కరణ్ షోలో వెకిలిగా మాట్లాడటం ద్వారా కోరి కష్టాలు కొనితెచ్చుకొన్న 25 ఏళ్ల హార్ధిక్ పాండ్యా తనకు ఎంతో ఇష్టమైన సంక్రాంతి పండుగ రోజున తీవ్ర విచారంలో మునిగిపోయాడని…ఇంటిలోని తన గదికే పరిమితమైపోయాడంటూ…హార్థిక్ తండ్రి హిమాంశు పాండ్యా చెబుతున్నారు.

టీవీ షో లతో అసలుకే మోసం…

క్రికెటర్లుగా రెండు పదుల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోడంతోపాటు.. .ఐపీఎల్ కాంట్రాక్టులతో కోట్లకు పడగలెత్తిన హార్థిక్ పాండ్యా లాంటి నవతరం క్రికెటర్లు తమ మూలాలను మరచిపోయి… నడమంత్రపు సిరితో పోకిరీ క్రికెటర్లుగా మారి దారి తప్పుతున్నారు.

కాఫీ విత్ కరణ్ షో లాంటి కాలక్షేపం బటాణీ టాక్ షోలో పాల్గొన్న సమయంలో సంస్కారం మరచి వాగటం ద్వారా….పాండ్యా, రాహుల్ పీకలోతు కష్టాలలో కూరుకుపోయారు.

ఆస్ట్రేలియాతో తీన్మార్ వన్డే సిరీస్ లో…కలసి పాల్గొనాల్సిన పాండ్యా, రాహుల్ ఇద్దరినీ…టీమ్ మేనేజ్ మెంట్ స్వదేశానికి తిప్పి పంపింది. అంతేకాదు…న్యూజిలాండ్ తో సిరీస్ కు సైతం దూరం పెట్టింది.

పెండింగ్ ఎంక్వైరీతో తమ కెరియర్ గాల్లో దీపంలా మారడంతో… హార్థిక్ పాండ్యా అయోమయంలో చిక్కుకొన్నాడు.

ఇంటిలోనే బంధీ…

పగటిపూట క్రికెట్… రాత్రి వేళల్లో స్నేహితులు, అమ్మాయిలతో ఆడుతూపాడుతూ.. ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపే హార్థిక్ పాండ్యా…. కరణ్ షో పరిణామాల దెబ్బతో షాక్ లో కూరుకుపోయాడు.

ఆస్ట్రేలియా నుంచి అర్థంతరంగా స్వదేశానికి… అదీ అవమానకరమైన రీతిలో తిరిగి వచ్చిన పాండ్యా తమ ఇంటిలోని తన గదికే పరిమితమైపోయాడని….ఏ ఒక్కరితో మాట్లాడటానికి ఆసక్తి చూపడం లేదని…పాండ్యా తండ్రి హిమాంశు వాపోతున్నారు.

హార్థిక్ కు మకర సంక్రాతిరోజున గాలిపటాలు ఎగురవేయటం అంటే ఎంతో ఇష్టమని…క్రికెట్ సిరీస్ ల కారణంగా గత కొద్ది సంవత్సరాలుగా సంక్రాంతి రోజున ఇంటి పట్టున ఉండటం లేదని… అయితే…ప్రస్తుత సస్పెన్షన్ తో ఇంటిలోనే ఉన్నా.. గది విడిచి బయటకురాలేదని… స్నేహితులతో ఫోనులో మాట్లాడటానికి సైతం ఆసక్తి చూపడం లేదని అంటున్నారు.

అడిలైడ్ వేదికగా ముగిసిన రెండో వన్డే మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూసిన తర్వాత…హార్థిక్ తన గదికే పరిమితమయ్యాడని తెలిపారు.

శిక్ష ఎంత కఠినం…

తమ కుటుంబసభ్యులెవ్వరూ…జరిగిన సంఘటన గురించి హార్థిక్ తో చర్చించరాదని నిర్ణయించామని హిమాంశు చెప్పారు. జరిగిన పొరపాటుకు హార్థిక్ క్షమాపణల ద్వారా పశ్చాతాపం ప్రకటించినా.. బీసీసీఐ సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించడం తీవ్రంగా బాధించిందని…హార్థిక్ పాండ్యా ఈ షాక్ నుంచి ఎంత త్వరగా బయటపడతాడో చూడాల్సిందేనని అంటున్నారు.

అసలు శిక్షకు ముందే కొసరు శిక్ష…

మరోవైపు…అపార ప్రతిభ ఉన్న హార్థిక్ పాండ్యా లాంటి నేటితరం క్రికెటర్లు….ఇలాంటి పొరపాట్లు ద్వారా జీవిత పాఠాలు నేర్చుకోవాలని… భారత క్రికెట్ జట్టు సభ్యులుగా ఎంత హుందాగా ఉండాలో నేర్చుకోక తప్పదని బీసీసీఐ చెప్పకనే చెబుతోంది.

పాండ్యా, రాహుల్ లాంటి యువక్రికెటర్లు…మార్చిలో జరిగే ఐపీఎల్ తో పాటు…వన్డే ప్రపంచకప్ లో పాల్గొనటం ద్వారా…ఈ చేదు అనుభవాన్ని మరచిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

పరిణతిలేని వాగుడుతో ఎంత అరిష్టమో…ఎలాంటి కష్టాలు ఉంటాయో…హార్థిక్ పాండ్యా అనుభవాన్ని చూసి నేటితరం నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.

First Published:  16 Jan 2019 10:00 AM GMT
Next Story