తెలంగాణ సీఎల్పీ భేటీ రచ్చరచ్చ….

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతను ఎన్నుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశం రచ్చరచ్చగా మారింది. సీఎల్పీ పదవి కోసం నేతలు పోటీ పడ్డారు. పదవి తనకు ఇవ్వాలంటే తనకు ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. సీఎల్పీ పదవి తనకే ఇవ్వాలని ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి కోరారు.

కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో పనికి రాని వాళ్లు చాలా మంది ఉన్నారని మండిపడ్డారు. అలాంటి వారిని పక్కన పెట్టి పార్టీని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు సుధీర్ రెడ్డి. ఎమ్మెల్యేల్లో తాను కూడా సీనియర్‌నేనని చెప్పారు.

సుధీర్ రెడ్డి

ప్రస్తుతం పార్టీలో ఉపాధ్యక్షులుగా ఉన్న వారికి వారి కుటుంబసభ్యులు కూడా ఓటేయరని వ్యాఖ్యానించారు. పార్టీని ప్రక్షాళన చేయాల్సిందిగా రాహుల్‌ గాంధీకి కూడా చెప్పానన్నారు.

మరోవైపు సీఎల్పీ పదవిని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి ఇవ్వాలని మరో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. కనీసం 10 ఎంపీ సీట్లు గెలవాలంటే కోమటిరెడ్డికి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు లింగయ్య.

చిరుమర్తి లింగయ్య

పాత బ్యాచ్‌ పోయి కొత్త నాయకత్వం రావాలని సూచించారు. పార్టీ నాయకత్వాన్ని మార్చకపోతే ఫలితం ఉండదన్నారు. సమావేశంలో నేతలు ఇలా ఎవరికి వారే మాట్లాడడంతో ఢిల్లీ నుంచి వచ్చిన హైకమాండ్ దూతలు తలపట్టుకున్నారు.