పరారీలో హర్షవర్థన్ చౌదరి….

జగన్‌పై హత్యాయత్నం కేసులో ఏపీ పోలీసులే కాదు…. నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కూడా ఎన్‌ఐఏను లెక్కచేయడం లేదు. జాతీయ భద్రతా దర్యాప్తు సంస్థ నోటీసులు ఇచ్చినా సరే రెస్టారెంట్ ఓనర్ హర్షవర్థన్‌ చౌదరి విచారణకు హాజరు కాలేదు.

ఈ నెల 15 తర్వాత విచారణకు హాజరుకావాల్సిందిగా ఎన్‌ఐఏ హర్షవర్ధన్ చౌదరికి నోటీసులు జారీ చేసింది. గురువారం ఆయన హాజరు కావాల్సి ఉంది. కానీ విచారణకు రాలేదు. ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియడం లేదు. టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే ఆయన ఎన్‌ఐఏ విచారణకు డుమ్మా కొట్టినట్టు భావిస్తున్నారు.

జగన్‌పై దాడి కేసులో హర్షవర్ధన్ చౌదరి పాత్రే కీలకమన్న ఆరోపణలు ఉన్నాయి. దాడి చేసిన శ్రీనివాస్‌కు షెల్టర్ ఇచ్చింది చౌదరినే. తన లైఫ్‌ సెటిల్ చేస్తానని హర్షవర్ధన్ చౌదరి చెప్పారని కూడా నిందితుడు శ్రీనివాసరావు చెప్పారు.

ఈనేపథ్యంలో హర్షవర్ధన్ చౌదరిని విచారిస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చేవి. కానీ ఆయన మాత్రం ఎన్‌ఐఏ ముందుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. మరో రెండు రోజులు ఎదురుచూసి…. అప్పటికీ హర్షవర్ధన్‌ చౌదరి విచారణకు రాకుండా ఉంటే…. అప్పుడు ఏం చేయాలో అదే చేస్తామని ఎన్‌ఐఏ అధికారులు చెబుతున్నారు.