దేవాలయాల దగ్గర మాట్లాడకూడదా? స్మశానంలో మాట్లాడొచ్చా?

చంద్రబాబు వ్యాఖ్యలపై తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మండిపడ్డారు. నేను విజయవాడ దుర్గ గుడి వద్ద మీడియాతో రాజకీయాలు మాట్లాడానని చంద్రబాబు సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నాడని….. దేవాలయాల దగ్గర రాజకీయాలు మాట్లాడే అలవాటు నాకు లేదని…. అలా మాట్లాడేది ఆయనేనని…. తిరుపతిలో దేవాలయం గేటు ఎదురుగా మాట్లాడింది చంద్రబాబేనని శ్రీనివాస్‌ యాదవ్‌ మండిపడ్డారు.

నేను విజయవాడ వెళ్ళినప్పుడు దుర్గ గుడినుంచి బయటకు రాగానే ఎలక్ట్రానిక్‌ మీడియా మిత్రులు చుట్టూ మూగి ప్రశ్నలు వేశారని…. అయితే వాళ్ళతో అక్కడ మాట్లాడకుండా ముందుకు కదిలానని…. వాళ్ళు నాతోనే ముందుకు కదిలి….. కొద్దిగా ముందుకు వెళ్ళాక…. ఇది మీడియా పాయింట్‌…. ఇక్కడ మాట్లాడవచ్చు అని చెబితే అప్పుడు మాట్లాడాను తప్ప…. నేను ఎప్పుడూ దేవాలయాల్లో రాజకీయాలు మాట్లాడలేదని…. చంద్రబాబు దేవాలయాలే కాదు…. స్మశానంలో కూడా రాజకీయాలు మాట్లాడతాడని…. హరికృష్ణ చనిపోయినప్పుడు స్మశానంలో…. మనం కలిసి పోటీ చేద్దాం అంటూ కేటీఆర్‌తో రాజకీయాలు మాట్లాడడానికి ప్రయత్నించాడని శ్రీనివాస్‌ విమర్శించారు.

బీసీల మధ్య చిచ్చు పెట్టడానికి, కుల రాజకీయాలు చేయడానికి నేను ప్రయత్నించానని చంద్రబాబు అన్నాడని…. నిజానికి చంద్రబాబే మాల, మాదిగల మధ్య…. బీసీలు, కాపుల మధ్య చిచ్చు పెట్టాడని….. చంద్రబాబు బ్రతుకంతా గోబెల్స్‌ లాగా అబద్ధాలు చెబుతూ రాజకీయాలు చేసి…. నెట్టుకొస్తున్నాడని మండిపడ్డారు.
చంద్రబాబు బీసీలకు వార్నింగ్‌ ఇవ్వడం ఏమిటి? ఈ విషయాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుంటుందని బెదిరించడం ఏమిటి? బీసీలే ఆయనకు త్వరలో గుణపాఠం చెబుతారు…. వాళ్ళే ఆయన్ను అధికారం నుంచి బయటకు పంపించేస్తారు…. అన్నారు.

బంధాలు, బంధుత్వాల గురించి చంద్రబాబుకు ఏం తెలుసు? పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచాడని…. వచ్చే ఎన్నికల్లో ఎన్టీ రామారావు అభిమానులంతా చంద్రబాబుకు గుణపాఠం నేర్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

మేము అక్కడికి వచ్చి రాజకీయాలు చేయడం ఏమిటని చంద్రబాబు చిందులేస్తున్నాడు. మరి ఆయన తెలంగాణకు వచ్చి మొన్న రాజకీయాలు చేయలేదా? నీ అవినీతి సొమ్మును తెలంగాణ ఎన్నికల్లో ఖర్చుపెట్టలేదా? ఏదైనా మాట్లాడేటప్పుడు సిగ్గుండాలని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మండిపడ్డారు.