పవన్ విషయంలో గోరంట్లను హెచ్చరించిన చంద్రబాబు

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి సానుకూలత వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్, తాను కలిస్తే జగన్‌కు ఏంటి బాధ అని ఇటీవల ప్రశ్నించిన చంద్రబాబునాయుడు… తాజాగా ఆసక్తికరమైన విధంగా వ్యవహరించారు.

పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు….మోడీ, కేసీఆర్‌, జగన్‌కు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడాలని ఆదేశించారు. మీడియా సమావేశాలు నిర్వహించి మోడీ, కేసీఆర్, జగన్‌ కుమ్మక్కు అయ్యారని వీలైనంతగా ప్రచారం చేయాలని నేతలకు సూచించారు.

ఈ సమయంలో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి…. మరి పవన్‌ కల్యాణ్ మాటేంటని చంద్రబాబును ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్ విషయంలో ఏం చేయాలి…. అని క్లారిటీ అడిగారు. దీంతో చంద్రబాబు కోపగించారు. ”చెప్పింది చేయండి అంతే…” అంటూ గోరంట్లపై రుసరుసలాడారు.

దీంతో పవన్‌ కల్యాణ్, చంద్రబాబు తిరిగి ఒకటవుతున్నారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పవన్‌ కల్యాణ్ కూడా చంద్రబాబు పట్ల సానుకూలంగా మాట్లాడారు. కేసీఆర్‌, జగన్‌ కలిసి చంద్రబాబును భయపెట్టాలని చూస్తున్నారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడంతో ఆయన కూడా చంద్రబాబు పట్ల ఇష్టంగా ఉన్నారన్న భావన ఏర్పడింది.