వన్డేల్లో…. హాఫ్ సెంచరీల, హ్యాట్రిక్ ల మొనగాడు ధోనీ

  • 2009 నుంచి 2019 వరకూ నాలుగు హ్యాట్రిక్ లు
  • అత్యధిక హాఫ్ సెంచరీల జాబితాలో 4వ స్థానం

జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీకి….వన్డే క్రికెట్లో …హాఫ్ సెంచరీల హ్యాట్రిక్ సాధించడం ఓ అలవాటుగా మారింది. తన కెరియర్ లో ఇప్పటికే 335 వన్డేలు ఆడిన ధోనీ… ఇప్పటి వరకూ నాలుగు వేర్వేరు సీజన్లలో వరుసగా మూడేసి చొప్పున హాఫ్ సెంచరీలు సాధించి…తనకు తానే సాటిగా నిలిచాడు.

2009లో తొలి హ్యాట్రిక్….

2009 సీజన్లో జరిగిన వన్డే సిరీస్ ల్లో మహేంద్ర సింగ్ ధోనీ…తొలిసారిగా మూడు వన్డేల్లో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. 94, 53, 84 స్కోర్లతో … తన కెరియర్ లో హాఫ్ సెంచరీల తొలి హ్యాట్రిక్ ను నమోదు చేశాడు.

2011 లో రెండో హ్యాట్రిక్….

ఆ తర్వాత రెండేళ్లకు…. ఇంగ్లండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ధోనీ మరోసారి వరుసగా మూడుమ్యాచ్ ల్లో అర్థశతకాలు బాదాడు. 69, 78, 50 పరుగుల స్కోర్లు సాధించినా… తన జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు.

2014లో మూడో హ్యాట్రిక్….

న్యూజిలాండ్ తో 2014లో ముగిసిన వన్డే సిరీస్ లో సైతం ధోనీ అర్థశతకాల హ్యాట్రిక్ సాధించాడు. తొలిమ్యాచ్ లో 56 పరుగులు, రెండోమ్యాచ్ లో 50 పరుగులు, మూడో మ్యాచ్ లో 79 పరుగుల స్కోర్లతో…. మూడో హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

అయితే…తన కెరియర్ లో నాలుగో హాఫ్ సెంచరీల హ్యాట్రిక్ కోసం నాలుగేళ్లపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. 2018 సీజన్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ సాధించలేకపోయిన ధోనీ… తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.

స్ట్రయిక్ రేట్ బాగా పడిపోయిందని, జట్టు నుంచి తప్పుకొని రిషభ్ పంత్ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలంటూ విమర్శకుల నుంచి ఒత్తిడి పెరిగింది. అయినా…కెప్టెన్ కొహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రిల అండదండలు పుష్కలంగా ఉండడంతో ధోనీ… 2019 ఆస్ట్రేలియా సిరీస్ వరకూ ఓపికగా ఎదురుచూశాడు.

కంగారూ గడ్డపై తొలి హ్యాట్రిక్….

సిరీస్ లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా ముగిసిన తొలివన్డేలో ధోనీ 97 బాల్స్ ఎదుర్కొని 51 పరుగుల స్కోరు సాధించినా… టీమిండియాకు పరాజయం తప్పలేదు.

ఆ తర్వాత అడిలైడ్ ఓవల్ వేదికగా ముగిసిన రెండో వన్డేలో ధోనీ తన అనుభవాన్నంతా ఉపయోగించి ఆడి 55 బాల్స్ లో 54 పరుగుల స్కోరుతో తనజట్టును విజేతగా నిలపడమే కాదు…సిరీస్ గెలుచుకొనే స్థితికి చేర్చాడు.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ వేదికగా ముగిసిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో ధోనీ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం 114 బాల్స్ ఎదుర్కొని ఆరు బౌండ్రీలతో 87 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు.

నాలుగో వికెట్ కు కేదార్ జాదవ్ తో కలసి 121 పరుగుల అజేయ భాగస్వామ్యంతో…టీమిండియాకు సిరీస్ విజయం అందించాడు. ఓవరాల్ గా మూడుమ్యాచ్ ల్లో 193 పరుగులు సాధించడం ద్వారా…. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.

హాఫ్ సెంచరీల రికార్డు….

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన భారత క్రికెటర్ల వరుసలో …ధోనీ నాలుగో స్థానంలో నిలిచాడు.

మాస్టర్ సచిన్ టెండుల్కర్ తన సుదీర్ఘ కెరియర్ లో…. మొత్తం 464 వన్డేలు ఆడి అత్యధికంగా 96 హాఫ్ సెంచరీలు సాధించాడు. 49 శతకాలతో ఏకంగా 18వేల 426 పరుగులు నమోదు చేశాడు.

మాస్టర్ తర్వాతి స్థానంలో ద్రావిడ్….

భారత క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్  344 వన్డేల్లో 83 హాఫ్ సెంచరీలు సాధించి…సచిన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ద్రావిడ్ సాధించిన మొత్తం 10 వేల 889 పరుగుల్లో 12 శతకాలు సైతం ఉన్నాయి.

ద్రావిడ్ తర్వాతి స్థానంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 72 హాఫ్ సెంచరీలతో తృతీయ స్థానంలో నిలిచాడు. గంగూలీ మొత్తం 311 వన్డేల్లో 22 సెంచరీలతో సహా 11వేల 363 పరుగులు సాధించాడు.

గంగూలీ రికార్డుకు ధోనీ గురి….

మహేంద్ర సింగ్ ధోనీ… వన్డే హాఫ్ సెంచరీల్లో సౌరవ్ గంగూలీ 72 హాఫ్ సెంచరీల రికార్డుకు గురిపెట్టాడు.

ఆసీస్ తో సిరీస్ వరకూ మొత్తం 335 వన్డేల్లో  ఆడిన ధోనీ 70 హాఫ్ సెంచరీలు సాధించాడు. 10 శతకాలతో సహా10వేల 366 పరుగులు తన ఖాతాలో జమ చేసుకొన్నాడు.

నాలుగోస్థానంలో కొహ్లీ….

టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కొహ్లీ తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 219 వన్డేల్లో 48 హాఫ్ సెంచరీలు, 39 సెంచరీలతో సహా 10వేల 385 పరుగులు సాధించాడు.

న్యూజిలాండ్ తో ఈనెల ఆఖరి వారంలో ప్రారంభమయ్యే ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో… ధోనీ, విరాట్ కొహ్లీ స్థాయికి తగ్గట్టుగా ఆడితే… మరిన్ని హాఫ్ సెంచరీలు, సెంచరీలు నమోదయ్యే అవకాశం లేకపోలేదు.