న్యూ ఇయ‌ర్‌…. న్యూ మోడ‌ల్ కార్‌….  క‌ర్నాట‌క‌లో కొత్త కాంట్ర‌వ‌ర్సీ

క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య ఖ‌రీదైన లైఫ్‌స్ట‌యిల్‌తో కాంగ్రెస్ పార్టీకి చిక్కులు తెస్తుంటారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న‌ప్పుడు ఆయ‌న ధ‌రించిన హ‌బ్లోట్ వాచ్ వివాదాస్ప‌ద‌మైంది. అప్ప‌ట్లో డెబ్బై ల‌క్ష‌ల రూపాయ‌ల‌ వాచీకి జ‌వాబు చెప్పుకోలేక ఇరుకున్న ప‌డిన సిద్ధ‌రామ‌య్య‌ ఇప్పుడు తాజాగా కారుతో కాంట్ర‌వ‌ర్సీలో చిక్కుకున్నారు.

ఆయ‌న ఇంటి ముందు మెరుస్తున్న‌ మెర్సిడెస్ బెంజ్ పార్క్ చేసి ఉంది. అది 2019 మోడ‌ల్ ఎస్‌యూవీ కార్‌. దాని విలువ కోటీ ఎన‌భై ల‌క్ష‌లు. ఆ కారుని సిద్ధ‌రామ‌య్య‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే బి. సురేశ్ ఇచ్చాడ‌ని బిజెపి ఆరోప‌ణ‌.

ఇటీవ‌ల సురేశ్ రాష్ట్ర స్మాల్ స్కేల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ప‌ద‌వికి నామినేట్ అయిన నేప‌థ్యంలో ఆయ‌న సిద్ధ‌రామ‌య్య‌కు స‌మ‌ర్పించుకున్న బ‌హుమ‌తి ఈ కారు… అంటోంది బిజెపి. బ‌హుమ‌తి కాదు లంచం అని కూడా గ‌గ్గోలు పెడుతోంది.

రికార్డు లేదే మ‌రి!

సిద్ధ‌రామ‌య్య కారు కాంట్రావ‌ర్సీలో ఆయనేమీ మాట్లాడ‌డం లేదు. కానీ ఆ పార్టీ నాయ‌కుడు డికె శివ‌కుమార్ నోరు విప్పారు. సురేశ్ ఆ కారుని సిద్ధ‌రామ‌య్య‌కు బ‌హుమ‌తిగా ఇచ్చాడ‌న‌డానికి ఎటువంటి ఆధార‌మూ లేదు. ఆ ఆరోప‌ణ‌ను బ‌ల‌ప‌రిచేవిధంగా ఏ రికార్డూ లేద‌న్నారాయ‌న‌.

మ‌రి ఆ కారు సిద్ధ‌రామ‌య్య ఇంటి ముందు ఎందుకుంద‌నే ప్ర‌శ్న‌కు బ‌దులుగా ”స‌ర‌దాగా అటూ ఇటూ వెళ్లి రావ‌డానికి వాడుకోమ‌ని ఇచ్చి ఉండ‌వ‌చ్చు” అని ముక్తాయించారు.

డికె శివ‌కుమార్

కారు కొన్న‌ది సురేశ్ అని చెప్ప‌కుండానే చెప్పేశారు శివ‌కుమార్‌. అది సిద్ధ‌రామ‌య్య ఇంటి ముందు ఉన్న వాస్త‌వాన్ని ఎవ‌రూ దాచ‌లేరు. ఇచ్చిన వ్య‌క్తి కానీ పుచ్చుకున్న వ్య‌క్తి కానీ నోరు విప్ప‌డం లేదు.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు సిద్ధ‌రామ‌య్య వాచీ క‌ష్టాలు తెచ్చి పెట్టింది. ఇప్పుడు రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కారు క‌ష్టాలను తెచ్చిపెడుతుందా?