Telugu Global
Others

కోస్తాను కాటేస్తున్న లాభాపేక్ష

పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తీర ప్రాంత మండలి (కోస్టల్ రెగ్యులేషన్ జోన్ – సి.ఆర్.జడ్.) ఉత్తర్వును ఆమోదించింది. దీని ప్రకారం పర్యావరణ పరంగా కఠినమైన నిబంధనలను సడలించడానికి అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు చట్టం ప్రకారం ఇలా సడలించడానికి వీలుండేది కాదు. కొత్త విధానం ప్రకారం సి.ఆర్.జడ్. పరిధిని, అభివృద్ధి లేని మండలాల పరిధిని తగ్గించారు. జన సాంద్రతనుబట్టి తీర ప్రాంత మండలాలను పునర్ వర్గీకరించారు. రక్షణ, ప్రజోపయోగ వసతులు కల్పించడానికి “కీలకమైన పథకాలు” చేపట్టేటప్పుదు […]

కోస్తాను కాటేస్తున్న లాభాపేక్ష
X

పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తీర ప్రాంత మండలి (కోస్టల్ రెగ్యులేషన్ జోన్ – సి.ఆర్.జడ్.) ఉత్తర్వును ఆమోదించింది. దీని ప్రకారం పర్యావరణ పరంగా కఠినమైన నిబంధనలను సడలించడానికి అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు చట్టం ప్రకారం ఇలా సడలించడానికి వీలుండేది కాదు. కొత్త విధానం ప్రకారం సి.ఆర్.జడ్. పరిధిని, అభివృద్ధి లేని మండలాల పరిధిని తగ్గించారు.

జన సాంద్రతనుబట్టి తీర ప్రాంత మండలాలను పునర్ వర్గీకరించారు. రక్షణ, ప్రజోపయోగ వసతులు కల్పించడానికి “కీలకమైన పథకాలు” చేపట్టేటప్పుదు జీవావరణ రీత్యా కీలకమైన ప్రాంతాలను కూడా మినహాయించకుండా కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త సి.ఆర్.జడ్. నిబంధనలు పర్యావరణం విషయంలో న్యాయం చేయడానికి, సమ న్యాయానికి, ముఖ్యంగా జాలర్లకు న్యాయం చేయడానికి ఎలా ఉపకరిస్తాయి?

సున్నితంగా ఉండే కోస్తా తీరంలో భారీ ఎత్తున వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలను కొత్త సి.ఆర్.జడ్. విధానం కింద అనుమతిస్తే మానవులకు, జీవావరణానికి మధ్య ఉన్న సమతూకం దెబ్బ తింటుంది. సముద్ర తీరంలోని పర్యావరణానికి విఘాతం కలుగుతుంది. అక్కడి వనరుల మీద ఆధారపడిన వారి జీవనోపాధి దెబ్బ తింటుంది. ప్రధానంగా జాలర్లు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడతారు.

ఇప్పటికే సముద్ర మట్టం పెరిగి, సముద్ర జలాలు భూ భాగంలోకి చొచ్చుకు రావడంవల్ల తీర ప్రాంతం ధ్వంసం అయి పల్లపు ప్రాంతాలలో నివసించే వారు ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బందులకు గురవుతున్నారు. భారత్ పశ్చిమ తీరంలో, నదుల సరసన ఉన్న మైదాన ప్రాంతాలలో ఉన్న వారు సముద్ర తీరంపై పడే ప్రభావానికి లోనవుతున్నారు. అలాంటప్పుడు ఈ కొత్త విధానానికి సంబంధించిన ఉత్తర్వు ఎవరికి మేలు చేస్తుంది?

ఈ విధానం 8.5 ట్రిలియన్ల ఖర్చుతో భారత సముద్ర తీరం పొడవునా కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన సాగర మాల పథకం అమలుకు మాత్రం తోడ్పడుతుంది. అక్కడ మౌలిక సదుపాయాలు, స్థిరాస్తి వ్యాపారం, పర్యాటకం పెరుగుతాయి. తీరం వెంట సరసమైన ధరలకు ఇళ్లు కొనుక్కునే వారికి ఉపయోగపడతాయి. తీర ప్రాంతాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించుకోవడానికి అనువైన ఈ విధానం వ్యాపార ప్రయోజనాలను మాత్రమే కాపాడుతుంది. కానీ కోస్తా తీరంలోని జీవావరణానికి, పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగిస్తుంది.

శతాబ్దాలుగా తీర ప్రాంతాన్ని పరిరక్షిస్తున్న జాలర్ల బతుకును ఛిద్రం చేస్తుంది. జాలర్లు తీరప్రాంతాన్ని కేవలం ఓ సహజ వనరుగా పరిగణించరు. తీర ప్రాంతాలలో ఉండే వనరులను వినియోగించుకుని లాభం పొందే వారికి మేలు కలుగుతుంది తప్ప మరే ప్రయోజనమూ నెరవేరదు.

ముంబై, చెన్నాయ్ లాంటి తీర ప్రాంత నగరాలలో పట్టణీకరణ పెరిగిపోతోంది. భూ వినియోగ పద్ధతులు మారి పోతున్నాయి. తీర ప్రాంతం ఆక్రమణలకు గురవుతోంది. తీరం వెంట రోడ్లు నిర్మించడం, పర్యావరణ కాలుష్యంవల్ల పల్లపు ప్రాంతాలకు, జల వనరులకు, చివరకు సముద్రానికే తీవ్ర విఘాతం కలుగుతోంది.

ఈ పరిణామాలవల్ల జాలర్లకు చేపలు దొరకడం తగ్గిపోయిందని అనేక అధ్యయనాల్లో రుజువైంది. దీనివల్ల వారి జీవనోపాధికి ఇబ్బంది ఏర్పడింది. చేపలు పట్టడమే వృత్తిగా జీవించే వారు పరాయి వారిగా మిగిలిపోతున్నారు. ఇది సమాజంలోని అంతరాలను మరింత పెంచుతోంది.

సాంప్రదాయికమైన, ఆచారపరమైన జాలర్ల హక్కులను గుర్తించడం నిరాకరించినందువల్ల కొత్త సి.ఆర్.జడ్. విధానం జాలర్ల హక్కులను ఉల్లంఘించడానికి దారి తీస్తుంది. అందువల్ల వనరులను వినియోగించుకునే విషయంలో ఘర్షణలు తలెత్తుతాయి. జాలర్ల ప్రయోజనాలు కాపాడడానికి అనువైన చట్టాలు లేవు. అభివృద్ధి పేరుతో నిర్వాసితులయ్యే వారు తమ హక్కులకోసం పోరాడుతున్నారు. వారి సమస్యను విస్మరించలేం.

అంతర్జాతీయ కంటేయినర్ల రవాణా కేంద్రాలను ఏర్పాటు చేయడం, దీనికోసం రేవులను ఉపయోగించుకోవడం ఇటీవల మితిమీరినందువల్ల తీర ప్రాంతాల వారి జీవనానికి తీవ్రమైన విఘాతం కలిగింది. సముద్ర జీవులు తమ ఆవాసాలు కోల్పోయాయి. తీర ప్రాంతంలో నివసించే వారు నిర్వాసితులై పోయారు. వారికి పునరావాసం కల్పించేడానికి అనువైన ప్రణాళికలు మాత్రం లేవు. తీర ప్రాంతంతో సంబంధం లేని వారి వ్యాపార ప్రయోజనాలను పరిరక్షించడంవల్ల సహజంగా తీర ప్రాంత వాసులు పేదరికంలోకి జారుకుంటున్నారు. తీవ్ర అసమానతకు గురవుతున్నారు.

రాజ్య వ్యవస్థ గతంలో కూడా జాలర్ల గోడు పట్టించుకోలేదు. ఇంతవరకు అమలులో ఉన్న సి.ఆర్.జడ్. నిబంధనలనే అమలు చేయలేదు. ప్రైవేటు వ్యాపారుల ప్రయోజనాలను ప్రోత్సహించడానికే ప్రభుత్వం కృషి చేస్తోంది. జాలర్లతో గానీ జాతీయ జాలర్ల వేదిక వంటి సంఘాలతో కాని ఎలాంటి సంప్రదింపులు జరపడం లేదు.

కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల పరిరక్షణే పరమావధిగా భావిస్తున్న ప్రభుత్వం తీర ప్రాంత వాసుల జీవనోపాధికి భంగం కలుగుతోందన్న అంశాన్ని ఖాతరు చేయడం లేదు. జీవావరణ వ్యవస్థలను పట్టించుకోవడం లేదు. దీర్ఘ కాలంలో ఈ నిర్లక్ష్యానికి మొత్తం సమాజం భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ప్రజల హక్కులకు విఘాతం కలుగుతుంది.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  21 Jan 2019 6:50 AM GMT
Next Story