షాపింగ్‌మాల్‌లో యువతికి వేధింపులు… తల్లి ఆత్మహత్య

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. షాపింగ్‌ మాల్‌లో తన కుమార్తెను లైంగికంగా వేధించడాన్ని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకుంది. మైలాన్‌దేవ్‌పల్లిలో ఈ ఘటన జరిగింది. మౌనిక గార్మెంట్‌లో ఒక యువతి పనిచేస్తుండేది. ఆమెను షాప్‌ యజమాని వివేకానంద లైంగికంగా వేధింపులకు గురి చేశాడు.

ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న యువతి కొంతకాలం పాటు వేధిస్తున్నా సరే సహిస్తూ పనిచేసింది. చివరకు వివేకానంద తీరు హద్దులు దాటడంతో ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఈ విషయం తెలుసుకున్న వివేకానంద నేరుగా ఆమె ఇంటికే వెళ్లి యువతిని, ఆమె తల్లిని బెదిరించాడు.

”నీ కూతురిని నా వద్దకు పంపాల్సిందే లేకుంటే మీ అంతుచూస్తా. కావాలంటే జీతం ఎక్కువ ఇస్తా”అని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన యువతి తల్లి కన్యాకుమారి ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కన్యాకుమారి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వివేకానందను అరెస్ట్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.