న్యూజిలాండ్ టూర్లో కొహ్లీ, ధోనీలను ఊరిస్తున్న రికార్డులు

  • కివీస్ పై అత్యధిక సెంచరీల రికార్డుకు కొహ్లీ గురి
  • న్యూజిలాండ్ పై అత్యధిక పరుగుల సచిన్ రికార్డుకు ధోనీ టార్గెట్

టీమిండియా కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీని మరో రికార్డు ఊరిస్తోంది.

6 సెంచరీలతో వీరూ టాప్….

న్యూజిలాండ్ తో ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో…. కొహ్లీ మరో రెండు సెంచరీలు సాధించగలిగితే…. ఇప్పటి వరకూ వీరేంద్ర సెహ్వాగ్ పేరుతో ఉన్న ఆరు సెంచరీల రికార్డు తెరమరుగుకానుంది.

న్యూజిలాండ్ ప్రత్యర్థిగా ఆరుశతకాలు బాదిన క్రికెటర్ గా వీరేంద్ర సెహ్వాగ్ ఉంటే… మాస్టర్ సచిన్ టెండుల్కర్, విరాట్ కొహ్లీ చెరో ఐదు సెంచరీలతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు.

అంతేకాదు…న్యూజిలాండ్ ప్రత్యర్థిగా సెహ్వాగ్ 23 ఇన్నింగ్స్ లో 1157 పరుగులతో రెండోస్థానంలో ఉంటే…విరాట్ కొహ్లీ…19 ఇన్నింగ్స్ లోనే 1154 పరుగులతో వీరూ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

అయితే …. న్యూజిలాండ్ పై అత్యధిక వన్డే పరుగులు సాధించిన రికార్డు మాత్రం మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతోనే ఉంది. సచిన్ మొత్తం 1750 పరుగులు సాధించాడు.

రెండు సెంచరీల దూరంలో

ఆస్ట్రేలియాతో ఇటీవలే ముగిసిన మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్  వరకూ…మొత్తం 219 మ్యాచ్ లు ఆడిన కొహ్లీ…210 ఇన్నింగ్స్ లో 39 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు సాధించాడు.

 మొత్తం 10వేల 339 పరుగులతో 59.76 సగటు నమోదు చేశాడు. అంతేకాదు…చేజింగ్ లో అత్యధికంగా 21 శతకాలు బాదిన తొలి క్రికెటర్ గా విరాట్ కొహ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

మాస్టర్ రికార్డుకు ధోనీ గురి….

టీమిండియా ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్రసింగ్ ధోనీ….ఏకంగా మాస్టర్ సచిన్ టెండుల్కర్ రికార్డుకే గురిపెట్టాడు.

ఆస్ట్రేలియాతో ఇటీవలే ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ లో …హాఫ్ సెంచరీల హ్యాట్రిక్ తో… ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకొన్న 37 ఏళ్ల ధోనీ…న్యూజిలాండ్ తో జరిగే ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో సైతం అదే జోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నాడు. 

సచిన్ దే అగ్రస్థానం…. 

 కివీ గడ్డపై న్యూజిలాండ్ ప్రత్యర్థిగా మాస్టర్ సచిన్ టెండుల్కర్ 18 మ్యాచ్ ల్లో 652 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

వీరేంద్ర సెహ్వాగ్ 18 మ్యాచ్ ల్లో 598 పరుగులతో మాస్టర్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ధోనీ ఇప్పటి వరకూ ఆడిన 10 మ్యాచ్ ల ద్వారా 456 పరుగులు సాధించాడు.

ఈనెల 23న ప్రారంభమయ్యే పాంచ్ పటాకా సిరీస్ లోని ఐదుమ్యాచ్ ల్లో…ధోనీ మరో 197 పరుగులు సాధించగలిగితే…మాస్టర్ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.

గత మూడు ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీలు సాధించిన ధోనీ…వచ్చే ఐదుఇన్నింగ్స్ లో ఇదే దూకుడు కొనసాగించగలిగితే… సచిన్ రికార్డు తెరమరుగు కాక తప్పదు.