ఓటమి ఎఫెక్ట్‌… ఆటగాళ్లకు గుండు కొట్టించిన కోచ్

బెంగాల్‌లో కలకలం రేగింది. ఆటల్లో గెలుపోటములు సహజమని ఆటగాళ్లకు ధైర్యం చెప్పాల్సిన కోచే తన అసహనాన్ని ప్రదర్శించారు. మ్యాచ్‌లో ఓడిపోయారంటూ టీం సభ్యులందరికీ గుండు కొట్టించాడు సదరు కోచ్. ఈ ఘటనపై బెంగాల్‌ హాకీ సంఘం విచారణకు ఆదేశించింది.

హాకీ జూనియర్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో భాగంగా జబల్‌పూర్‌లో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బెంగాల్ అండర్‌-19 జట్టు 1-5 తేడాతో ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఆటగాళ్లపై కోచ్‌ ఆనంద్‌ కుమార్‌కు పట్టలేనంత కోపం వచ్చింది. వారికి గుండు శిక్ష వేశాడు.

కోచ్ ఆదేశించడంతో 18 మందిలో 16 మంది ఆటగాళ్లు గుండు గీయించుకున్నారు. గుర్తుండిపోయేలా వారికి గ్రూప్‌ ఫొటో తీయించాడు కోచ్. కోచ్‌ తీరును తీవ్రంగా పరిగణించిన బెంగాల్ హాకీ సంఘం విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

అయితే కోచ్‌ ఆనంద్ ఈ ఆరోపణలను ఖండించారు. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లపై కేకలు వేసింది నిజమేగానీ… ఓడిపోతే గుండు గీయించుకోవాలని తాను చెప్పలేదన్నారు. తన భార్య ఆస్పత్రిలో ఉండడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం కూడా తనకు లేకుండా పోయిందన్నారు.