ఒకే ఓవర్‌లో 30పరుగులు… విలపించిన ఇషాంత్ శర్మ

2013లో ఆస్ట్రేలియా- భారత్‌ మధ్య మొహాలీలో జరిగిన మ్యాచ్‌ టీమిండియా అభిమానులకు చేదు అనుభవాన్ని మిగిలింది. ఆఖరి 18 బంతుల్లో ఆస్ట్రేలియా 44 పరుగులు చేయాల్సి ఉండేది. దాంతో తప్పనిసరిగా ఇండియానే గెలుస్తుందని భావించారు. కానీ 48వ ఓవర్‌లో ఫాల్క్‌నర్ విధ్వంసంతో భారత్‌ ఆశలు ఆవిరయ్యాయి.

48వ ఓవర్‌లో ఏకంగా 30పరుగులను ఆస్ట్రేలియా సాధించింది. ఈ ఓవర్‌లో బౌలింగ్‌ చేసింది ఇషాంత్‌ శర్మ. అతడు బౌలింగ్ చేసిన 48వ ఓవర్‌ వల్లే భారత్‌ ఓటమి పాలైంది. ఈ అంశంపై తాజాగా ఇషాంత్ శర్మ స్పందించారు. తన వల్లే ఆ రోజు భారత్ మ్యాచ్‌ను ఓడిపోయిందని గుర్తు చేసుకున్నారు.

ఒకే ఓవర్‌లో 30 పరుగులు రావడంతో తాను ఏడ్చేశానని చెప్పాడు. దాదాపు 15 రోజులు పాటు ఏడ్చానని వివరించారు. కానీ నాటి తన స్నేహితులు, ప్రస్తుత భార్య అయిన ప్రతిమ సాయంతో ఆ చేదు అనుభవం నుంచి బయటపడగలిగానని ఇషాంత్ శర్మ వివరించారు.

ఆ మ్యాచ్‌లో ఫాల్క్‌నర్‌ 29 బంతుల్లో 64 పరుగులు చేసి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. ఆ మ్యాచ్‌ ఇషాంత్‌ శర్మ క్రికెట్ జీవితంపై తీవ్ర ప్రభావమే చూపింది.