కాపు రిజర్వేషన్లపై బాబు తిరకాసు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో కాపుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకే కేటాయించాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

5శాతం రిజర్వేషన్లు కాపులకు ఇచ్చి మిగిలిన 5 శాతం రిజర్వేషన్లను ఇతర అగ్రవర్ణాల వారికి ఇవ్వాలని చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై మరింత సమగ్రంగా పరిశీలన చేసి విధివిధానాలను అసెంబ్లీ ముందుకు తీసుకురావాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇలా చేయడం సాధ్యం కాదని తెలిసినా కాపుల్లో ఉన్న ఆందోళనను తొలగించి, వచ్చే ఎన్నికల్లో వాళ్ళను తమవైపు తిప్పుకోవడానికి వీలు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.

2014 ఎన్నికల సమయంలో కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు హామీ ఇచ్చారు. మంజునాథ కమిషన్‌ కూడా వేశారు. అయితే హడావుడిగా కమిషన్‌ నుంచి నివేదిక తీసుకుని అసెంబ్లీలో ఆమోదించి, కేంద్రానికి కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు ప్రభుత్వం తీర్మానం చేసి పంపింది. అయితే కమిషన్ చైర్మన్ అంగీకారం లేకుండానే ఆ తీర్మానాన్ని ఆమోదించి పంపినా కేంద్రం ఆమోదించదని తెలిసి కూడా చంద్రబాబు ఎన్నికల ఎత్తుగడల్లో భాగంగా ఈ పని చేశారు.

ఈ నేపథ్యంలో ఎలాగో ఈబీసీలకు కేంద్రం రిజర్వేషన్లు కల్పించినందున…. అందులో ఐదు శాతం కాపులకు ఇవ్వడం ద్వారా ఎన్నికల సమయంలో కాపులకు ఇచ్చిన హామీని కూడా నెరవేర్చినట్టు ప్రచారం చేసుకోవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉంది.