16 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య

మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే అన్నాడో కవి. ప్రస్తుతం సమాజంలో పరిస్థితి చూస్తే అది నిజమే అని అర్థమవుతోంది. భర్త మరో స్త్రీతో సంబంధం కలిగి ఉన్నాడని.. ఆస్తంతా ఆమెకి రాసిచ్చేస్తాడని అనుమానించిన భార్య ఏకంగా 16 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి భర్తను చంపించింది. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే…. గురుగ్రామ్‌లోని బజ్‌ఘేరా సమీపంలోని లోయలో ఒక వ్యక్తి శవం పడుందని పోలీసులకు సమాచారం అందింది. ఒక కాటన్ బ్యాగులో శవాన్ని కట్టి లోయలోకి విసిరేసినట్లు పోలీసులు అనుమానించారు. అతను జోగీందర్ సింగ్(37)గా గుర్తించారు. జోగిందర్ భార్య స్వీటీని పోలీసులు అనుమానించి విచారించగా పలు విషయాలు బయటపడ్డాయి.

హర్యాణాలోని ఝాజర్ జిల్లాకు చెందిన జోగీందర్, స్వీటీ దంపతులు. అయితే కొంత కాలంగా జోగీందర్ మరో స్త్రీతో సంబంధం కలిగి ఉన్నాడని స్వీటీ అనుమానించింది. తనను వదిలేసి ఆమెను పెళ్లి చేసుకొని ఆస్తంతా ఆమెకే రాస్తాడని భావించిన స్వీటీ ఎలాగైనా భర్తను చంపాలని ప్లాన్ వేసింది.

యూపీ, ఢిల్లీకి చెందిన కొందరు కిరాయి హంతకులకు 16 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకుంది. జనవరి 15 రాత్రి తమ ఇంట్లోనే జోగీందర్‌ను వాళ్లు విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. అనంతరం ఒక కాటన్ సంచిలో శవాన్ని కుక్కి బజ్‌ఘేరా ప్రాంతంలోని లోయలో పడేశారు.

అనంతరం స్వీటీ తన భర్త కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అయితే స్వీటీనే జోగీందర్ మరణం వెనక ఉన్నట్లు పోలీసులు గుర్తించి ఆమెను అరెస్టు చేశారు. స్వీటీతో పాటు హత్యలో పాల్గొన్న ఏడుగురు నిందితులను గురుగ్రామ్ కోర్టులో ప్రవేశపెట్టారు.