స్నేహితుడిని చంపి 200 ముక్కలు చేశాడు…. ఎందుకో తెలుసా…?

నాలుగేళ్ల క్రితం ముంబైలో ఒక ఘటన జరిగింది. క్షణికావేశంలో ప్రియుడిని చంపిన ఒక యువతి.. మరో యువకుడి సహాయంతో శరీరాన్ని వంద ముక్కలు చేసి బయట పడేసింది. అదే ఘటన ఆధారంతో రాంగోపాల్ వర్మ ఒక సినిమా కూడా నిర్మించాడు. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా గగుర్పాటు కలిగించే హత్య జరిగింది. అదే ముంబైలో….

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని శాంతాక్రజ్‌కు చెందిన పింటూ శర్మ (42), విరార్‌కు చెందిన గణేష్ కోల్హద్కర్ (58) స్నేహితులు. గణేష్ త్వరలో జరగబోయే తన వివాహం కోసం పింటూ వద్ద లక్ష రూపాయలు అప్పు చేశాడు. అందులో 40 వేల రూపాయలు తిరిగి పింటూకి చెల్లించాడు.

గత ఏడాది డిసెంబర్ 16న గణేష్ ఇంటికి పింటూ శర్మ వచ్చాడు. ఈ సందర్భంగా గణేష్‌ను పింటు ఆటపట్టించాడు. ఇంత లేట్‌గా పెళ్లి చేసుకుంటున్నావు… నీ భార్య తప్పకుండా వివాహేతర సంబంధం పెట్టుకుంటుంది అంటూ తూలనాడాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ ఘర్షణలోనే గణేష్‌ తలను పింటూ గోడకేసి బాదాడు. దీంతో గణేష్ అక్కడిక్కడే మరణించాడు.

గణేష్ మరణంతో కంగారుపడిన పింటూ.. శవాన్ని మాయం చేయడానికి ఒక ప్రణాళిక రచించాడు. బయటకు వెళ్లి ఒక యాక్సా బ్లేడ్ (రంపం వంటిది) తీసుకొని వచ్చి శవాన్ని 200 పైగా ముక్కలు చేశాడు. చిన్న ముక్కలను నాలుగు రోజుల పాటు ఇంటిలోని టాయిలెట్‌లో వేసి ఫ్లష్ చేశాడు. పెద్ద ముక్కలను సంచిలో పట్టుకొని లోకల్ ట్రైన్ ఎక్కి బయటకు విసిరేశాడు.

అయితే గణేష్ ఇంటి డ్రైనేజీ బ్లాక్ అవడంతో బాగు చేయించడానికి ప్రయత్నించగా.. దాంట్లో నుంచి ఎముకలు, మాంసం ముక్కలు బయటకు రావడంతో పోలీసులకు విషయం తెలియజేశారు. దీంతో నిందితుడు పింటూ శర్మను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

ముంబై నేరచరిత్రలోనే ఇది చాలా అరుదైన కేసని.. ఇలా మనిషిని ముక్కలు ముక్కలు చేసి పారేయడం చూడలేదని ముంబై పోలీసులు చెప్పడం గమనార్హం.