ఆస్ట్రేలియన్ ఓపెన్  ఫైనల్లో దిగ్గజాల సమరం

  • పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గితే 20 కోట్ల 50 లక్షల ప్రైజ్ మనీ
  • ఫైనల్లో సెర్బియన్ వండర్, స్పానిష్ థండర్
  • నువ్వానేనా అంటున్న జోకోవిచ్, రాఫెల్ నడాల్

ప్రపంచ టెన్నిస్ అభిమానులను గత రెండువారాలుగా అలరిస్తున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో అతిపెద్ద సమరానికి… మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనాలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. 

ఫైనల్లో ఆ ఇద్దరు….

టైటిల్ ఫైట్ లో టాప్ సీడ్ నోవాక్ జోకోవిచ్, రెండో సీడ్ రాఫెల్ నడాల్ అమీతుమీ తేల్చుకోనున్నారు. టైటిల్ విజేతగా నిలిచిన ఆటగాడి కోసం ట్రోఫీతో పాటు 20 కోట్ల 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ సైతం ఎదురుచూస్తోంది.

2019 గ్రాండ్ స్లామ్ సీజన్ తొలి టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆఖరాటకు రంగం సిద్ధమయ్యింది. పురుషుల సింగిల్స్ ఫైనల్ కు ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జోకోవిచ్, రెండోర్యాంకర్ రాఫెల్ నడాల్ చేరుకోడంతో… టైటి్ల ఫైట్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

ఏడో టైటిల్ కు జోకో గురి….

ప్రపంచ టెన్నిస్ మొదటి ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్ల మధ్య జరిగే..ఈ టైటిల్ ఫైట్…కొదమసింహాల పోరులా సాగే అవకాశం ఉంది. గ్రాండ్ స్లామ్ టోర్నీల చరిత్రలో ఇద్దరు ఆటగాళ్లకు కళ్లు చెదిరే రికార్డే ఉంది.

ఇప్పటికే ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సెర్బియన్ వండర్ జోకోవిచ్.. ఏడోసారి ఫైనల్స్ చేరడమే కాదు…ఏడో టైటిల్ కు సైతం గురిపెట్టాడు.

మరోవైపు…స్పానిష్ బుల్ నడాల్ కు మాత్రం…ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ఒకే ఒక్కసారి నెగ్గిన ఘనత మాత్రమే ఉంది. తన కెరియర్ లో అత్యధిక ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన నడాల్… రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కోసం తహతహలాడుతున్నాడు.

సెమీస్ లో అలవోక విజయాలు….

మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా …సెంటర్ కోర్ట్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో…టాప్ సీడ్ జోకోవిచ్…ప్రత్యర్థి, ఫ్రెంచ్ 28వ సీడ్ ఆటగాడు పావోలిన్ ను వరుస సెట్లలో చిత్తు చేశాడు.

ఏకపక్షంగా సాగిన ఈ పోటీలో తొలిసెట్ ను 6-0తో నెగ్గిన జోకోవిచ్… ఆ తర్వాతి రెండుసెట్లలో ప్రత్యర్థికి రెండుగేమ్ లు చొప్పున మాత్రమే విడిచిపెట్టాడు. తన కెరియర్ లో ఏడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు.

గ్రీకు వీరుడికి రఫా దెబ్బ…

అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో…స్పానిష్ బుల్ నడాల్ సైతం వరుస సెట్లలోనే గ్రీకు సంచలనం స్టెఫానోస్ ను చిత్తు చేశాడు. గంటా 46 నిముషాలపాటు సాగిన ఈ పోరులో స్పానిష్ బుల్ కు …గ్రీకువీరుడు స్టెఫానోస్ ఏమాత్రం సరిజోడీ కాలేకపోయాడు. నడాల్ 6-2, 6-4, 6-0తో స్టెఫానోస్ ను ఇంటిదారి పట్టించాడు.

తన కెరియర్ లో ఇప్పటికి ఓసారి మాత్రమే ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్రోఫీ అందుకొన్న నడాల్ కు…గ్రాండ్ స్లామ్ టోర్నీల ఫైనల్స్ చేరడం ఇది 25వసారి. 2009లో తొలిసారిగా ఆస్ట్రేలియా చాంపియన్ గా నిలిచిన నడాల్… టైటిల్ ఫైట్ లో…టాప్ సీడ్ నొవాక్ జోకోవిచ్ తో అమీతుమీకి సిద్ధమయ్యాడు.

20 కోట్ల 50 లక్షల ప్రైజ్ మనీ….

ఇద్దరు ఆటగాళ్లు భీకరమైన ఫామ్ లో ఉండడంతో…టైటిల్ సమరం కొదమసింహాల పోరాటంలా సాగే అవకాశం ఉంది. టైటిల్ విజేతకు ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్రోఫీతో పాటు…20 కోట్ల 50 లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు.

ఆస్ట్రేలియా వాణిజ్య రాజధాని మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా జరిగే ఈ సూపర్ డూపర్ ఫైట్ ను… క్రీడాభిమానులు… ప్రధానంగా టెన్నిస్ ప్రియులు తప్పక చూసితీరాల్సిందే.