Telugu Global
National

అన్న‌ కోసం.... త్యాగానికి సిద్ధం

ప్రియాంకా గాంధీ వాద్రా… కాంగ్రెస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ. జ‌న‌వ‌రి 23వ తేదీన అఖిల భాత‌ర కాంగ్రెస్ పార్టీ తెర తీసిన కొత్త అంకం. భార‌త రాజ‌కీయ నాట‌క‌రంగం మీద కొత్త అంకానికి శ్రీ‌కారం చుట్టింది నూట‌పాతికేళ్లు దాటిన ఐఎన్‌సి. వ‌చ్చే నెల‌లో (ఫిబ్ర‌వ‌రి, 2019) పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు స‌మ‌ర‌భేరి మోగ‌నున్న త‌రుణంలో ఆ పార్టీ తీసుకున్న కీల‌క నిర్ణ‌యం ఇది. అయితే… ప్రియాంకా గాంధీ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో అడుగుపెట్ట‌డానికి ఇది స‌రైన స‌మ‌య‌మేనా? ఆధారం లేదు… […]

అన్న‌ కోసం.... త్యాగానికి సిద్ధం
X

ప్రియాంకా గాంధీ వాద్రా… కాంగ్రెస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ. జ‌న‌వ‌రి 23వ తేదీన అఖిల భాత‌ర కాంగ్రెస్ పార్టీ తెర తీసిన కొత్త అంకం. భార‌త రాజ‌కీయ నాట‌క‌రంగం మీద కొత్త అంకానికి శ్రీ‌కారం చుట్టింది నూట‌పాతికేళ్లు దాటిన ఐఎన్‌సి. వ‌చ్చే నెల‌లో (ఫిబ్ర‌వ‌రి, 2019) పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు స‌మ‌ర‌భేరి మోగ‌నున్న త‌రుణంలో ఆ పార్టీ తీసుకున్న కీల‌క నిర్ణ‌యం ఇది. అయితే… ప్రియాంకా గాంధీ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో అడుగుపెట్ట‌డానికి ఇది స‌రైన స‌మ‌య‌మేనా?

ఆధారం లేదు… ఉన్న‌వ‌న్నీ ఆశ‌లే

”ఇదే స‌రైన స‌మ‌యం” అని చెప్ప‌డానికి ఒక్క ఆధార‌మూ క‌నిపించ‌డం లేదు. క‌నిపిస్తున్న ఆధారాల‌న్నీ కాంగ్రెస్ ను గ‌ట్టెక్కించ‌డానికి ఈ అస్త్రం ఆస‌రా అవుతుందేమోన‌నే చిగురుటాశ‌లే. కాంగ్రెస్ పార్టీ మునుగుతున్న పుట్టిలా ఉంది ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో. ఇప్ప‌టికే ఎస్‌పి- బిఎస్‌పిలు జ‌త‌క‌ట్టాయి.

బిజెపి మ‌త‌ప‌ర‌మైన భావోద్వేగాలకు భార‌తీయ‌త రంగు అద్ది సెంటిమెంట్ ప‌గ్గాల‌ను ఒడిసి ప‌ట్టుకుని ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏకాకిగా ఎన్నిక‌ల బ‌రిలో దిగాలి. పార్టీని సంస్థాగ‌తంగా ప‌టిష్ట‌ప‌రుచుకోవ‌డం అనే ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌లేద‌క్క‌డ‌.

గాంధీ కుటుంబం అనే భావోద్వేగాల బంధం మీద‌నే ఆధార‌ప‌డుతోంది కాంగ్రెస్‌. ఆ బంధం ఎంత బ‌లంగా ఉందో తేల్చుకోవ‌డానికి ప్రియాంక‌ను రంగంలో దించుతున్న‌ట్లే ఉంది త‌ప్ప‌, మ‌రో స‌హేతుక‌మైన కార‌ణం క‌నిపించ‌డం లేదు ఈ ప‌రిణామంలో.

అవ‌స‌ర‌మా? అభ్యుద‌య‌మా?

సాధార‌ణంగా రాజ‌కీయ నాయ‌కులు త‌మ వార‌సుల‌ను రంగంలో దింపుతుంటారు. వార‌సుల‌ను లాంచ్ చేయ‌డానికి అనువైన వాతావ‌ర‌ణం కోసం ఎదురు చూస్తుంటారు. వాతావ‌ర‌ణం అనుకూలించే లోపు వార‌సుల‌ను రాజ‌కీయాల‌కు అనుగుణంగా త‌యారు చేసుకుంటారు. ప‌రిస్థితులు అనుకూలించేట‌ప్పుడు బ‌రిలో దించి విజ‌యంతో మంచి బోణీనిస్తారు. ములాయం సింగ్ యాద‌వ్ త‌న కొడుకు అఖిలేశ్‌కు కార్పెట్ ప‌రిచిన‌ట్లు.

ఇది కాకుండా కాలం సృష్టించే ప‌రిణామాలు కొన్ని ఉంటాయి. అవి హ‌టాత్తుగా వార‌సుల‌ను రంగంలోకి దించుతాయి. నాయ‌కుల హ‌టాన్మ‌ర‌ణంతో వార‌సులు అక‌స్మాత్తుగా రంగంలో దిగిపోవాల్సిన వ‌స్తుంది. ఇందిరా గాంధీ మ‌ర‌ణంతో రాజీవ్ గాంధీ వ‌చ్చిన‌ట్లు. మాధ‌వ‌రావు సింధియా మ‌ర‌ణంతో జ్యోతిరాదిత్య వ‌చ్చిన‌ట్లు.

ఇప్పుడు ప్రియాంక క్రియాశీల‌క రాజ‌కీయ ఆరంగేట్రానికి పై ప‌రిస్థితులేవీ కార‌ణాలు కావు. కాంగ్రెస్ పార్టీ టైటానిక్ ఓడ‌ను న‌డిపే శ‌క్తి సామ‌ర్థ్యాలు రాహుల్ గాంధీకి ఉన్నాయ‌ని న‌మ్మ‌డానికి ఎవ‌రూ సిద్ధంగా లేక‌పోవ‌డ‌మే ఇప్పుడు క‌నిపిస్తున్న ఏకైక కార‌ణం.

ప్రాంతీయ పార్టీల‌తో పొత్తు పెట్టుకుందామంటే… కాంగ్రెస్‌తో పొత్తుకు ఓకే అంటున్న పార్టీలు కూడా ప్ర‌ధాని అభ్య‌ర్థిగా రాహుల్‌కు ఓకే చెప్ప‌క‌పోవ‌డ‌మే. ప్రియాంక ప్ర‌ధాని అభ్య‌ర్థి అనే ప్ర‌తిపాద‌న‌కు పొత్తు పార్టీలు స‌మ్మ‌తిస్తాయేమోన‌ని ఒక ఆశ ఆ పార్టీకి. ప్ర‌ధానిగా మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌నే గొప్ప అభ్యుద‌యం కాంగ్రెస్ పార్టీది… అని పెద్ద మ‌న‌సుతో అర్థం చేసుకుందామంటే… ఎక్క‌డో డీటెయిల్స్ మిస్ అయిన క‌థ‌నంలాగా తోస్తోంది.

నాన‌మ్మ‌ను చూసిన వాళ్లు ఇంకా ఉన్నారా?

ఇందిరా గాంధీ పోలిక‌లున్న అమ్మాయి కావ‌డంతో ప్రియాంక త‌న నాన‌మ్మ వార‌స‌త్వాన్ని కొనసాగిస్తుంద‌ని ఆశావహుల వాద‌న‌. నాన‌మ్మ పోలిక‌లున్నాయి స‌రే, ఆ నాన‌మ్మ‌ను చూసిన వాళ్లు ఎంత‌మంది ఉన్నారిప్పుడు. ఆమె పోయి 34 ఏళ్ల‌యింది.

ఇందిరా గాంధీ ఎన్నిక‌ల ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా ఉత్త‌రాది రాష్ట్రాల్లో విస్త్రృతంగా ప‌ర్య‌టించేవారు. డెబ్బై, ఎన‌భై తొలి నాళ్ల‌లో ఆమెను ప్ర‌త్య‌క్షంగా చూసిన త‌రం అంత‌రించి పోయిందిప్పుడు. అప్ప‌టి యువ‌త కూడా ఇప్పుడు అరవై, డెబ్బైల‌కు చేరి ఉంటుంది. ఇప్ప‌టి క్రియాశీల‌క త‌రానికి ఇందిరా గాంధీయే కాదు రాజీవ్ గాంధీ కూడా స‌రిగ్గా గుర్తు ఉండ‌ని ప‌రిస్థితిలో…. ప్రియాంక‌లో ఇందిరా గాంధీని చూడ‌డానికి ఎంత‌మంది ఉన్న‌ట్లు?

మంచి అమ్మాయి

పార్టీల‌ను, రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి ప్రియాంక‌ను ఒక‌సారి అవ‌లోక‌నం చేసుకుంటే… ఒక సున్నిత‌మైన వ్యక్తి. చూడ‌గానే మ‌న‌సు ఆహ్లాదంగా అనిపించే స్వ‌చ్ఛ‌మైన ముఖం. ఆమెలో త‌మ ఇంటి ఆడ‌బిడ్డ‌ను చూసుకునేట‌ట్లు ఉంటుంది.

ఆహార్యం, చిరున‌వ్వు, మాట‌ల్లో మృదుత్వం ఆక‌ట్టుకుంటాయి. అవ‌స‌ర‌మైన‌ప్పుడే మాట్లాడుతూ, మాట అన‌వ‌స‌రంగా తూల‌కుండా తూచిమాట్లాడుతూ, ఎవ‌రినీ వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించ‌కుండా సిద్ధాంత‌ప‌ర‌మైన విమ‌ర్శ‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతుండ‌డంతో దృఢ‌మైన వ్య‌క్తిత్వం ఉన్న అమ్మాయి అని ఒక‌రు చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అది ఆమెలో బౌద్ధం తెచ్చిన ప‌రిణ‌తి కూడా కావ‌చ్చు. గాంధీ కుటుంబం ఇంటి బిడ్డ‌గా ఆమె జీవ‌న‌శైలి నిరాడంబ‌రంగా ఉండేది.

ఇవ్వ‌డానికే పుట్టిందా

చ‌దువు పూర్త‌యిన త‌ర్వాత ప్రియాంక ఒక ప్రైవేట్ స్కూల్లో టీచ‌రుగా ఉద్యోగం చేసింది. కాంగ్రెస్ పార్టీ నావ‌ను ఒడ్డుకు చేర్చాలంటే ఆ పార్టీ దీమంతుల‌కు ద‌మ్ము చాల‌ని ప‌రిస్థితి అది. సీతారామ్ కేస‌రి నుంచి పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను గాంధీ కుటుంబం చేతిలో పెట్ట‌డానికి పెద్ద త‌ల‌ల‌న్నీ సోనియా ముందు మోక‌రిల్లాయి.

అప్పుడు ప్రియాంక కోసం స్కూలుకు క‌బురు పెట్టారు సోనియా. ప్రియాంక వ‌చ్చి త‌ల్లికి స‌హాయంగా చ‌ర్చ‌లో పాల్గొన్న ఉదంతాన్ని ఊటంకించాయి అప్ప‌ట్లో కొన్ని జాతీయ ప‌త్రిక‌లు. అంత‌కంటే ముందే ఆమె రాజీవ్ గాంధీ కోసం ఎన్నిక‌ల ప్ర‌చారం చేసి ఉంది. ఆ త‌ర్వాత త‌ల్లి కోసం ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న‌ది.

ఆ త‌ర్వాత అన్న‌ కోస‌మూ ప్ర‌చారం చేసింది. ఆడ‌ప‌డుచు పుట్టింటి కోసం చేసిన సేవ ఇది. ఇప్పుడు అన్న స‌మ‌ర్థ‌త మీద దేశ‌మంతా సందేహంగా చూస్తున్న త‌రుణంలో ”ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌ర్నీ గెలిపించావు. మ‌ళ్లీ ఓ సారి గెలిపించు” అంటూ పెద్ద‌లంతా క‌లిసి స్టీరింగ్ ఆమె చేతిలో పెట్టారు.

కండిష‌న్‌లో లేని వాహ‌నం

వాహ‌నం కండిష‌న్‌లో ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. రోడ్డు స‌మ‌త‌లంగా ఉన్న‌ట్లూ క‌నిపించ‌డం లేదు. గ‌తుకుల రోడ్డు మీద పంక్చ‌ర్లు వేసుకున్న టైర్లు, వందేళ్ల నాటి ఇంజ‌న్‌తో బ‌రిలో దిగుతోంది ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీ. అది కూడా క‌ర‌డు క‌ట్టిన కాషాయ‌వాది యోగి ఆదిత్య‌నాథ్ స్వాధీనంలో ఉన్న రాష్ట్రంలో.

ప్ర‌ధాని మోదీ పోటీ చేసే వార‌ణాసి కూడా ఆమె భుజాల మీద మోపిన తూర్పు ఉత్త‌ర ప్ర‌దేశ్ 32 నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉంది. ఇవే కాదు, త‌ల్లి సోనియా, అన్న రాహుల్ బ‌రిలో దిగే రాయ్‌బ‌రేలీ, అమేథీలు ఆ ముప్పై రెండులోనే ఉన్నాయి. పంతొమ్మిది వంద‌ల ఎన‌భైల త‌ర్వాత అక్క‌డ పార్టీ బ‌లంగా లేదు. అంటే… ఇందిరా గాంధీ త‌ర్వాత ఆ రాష్ట్రంలో పార్టీ ప‌ట్టు కోల్పోయింది. ఇందిర వార‌సురాలొచ్చి పార్టీలో పట్టు తెస్తుంద‌నే సెంటిమెంట్ లైన్ వెండితెర‌కు బాగానే ఉంటుంది, పొలిటిక‌ల్ స్క్రీన్ మీద పండ‌డం క‌ష్టమే.

పార్టీకి పోయేదేమీ లేదు

ప్రియాంక‌కు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం వ‌ల్ల కాంగ్రెస్ పార్టీకి పోయేదేమీ ఉండ‌దు. వ‌స్తే గెలుపు, పోతే ఇప్పుడున్న య‌థాత‌థ స్థితి మాత్ర‌మే. ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగా లేక‌పోయేది ప్రియాంక‌కే. ఆమె సార‌థ్య బాధ్య‌త‌ల‌ను త‌ప్పు ప‌ట్ట‌డానికి ప్ర‌త్య‌ర్థి పార్టీలు వేయి క‌ళ్ల‌తో చూస్తుంటాయి…. ప్రియాంక క్రియాశీల‌క రాజ‌కీయ ప్ర‌స్థానంలో తొలి అడుగే వైఫ‌ల్య‌పు మైలురాయిగా మారుతుంది.

ఇర‌వై ఏళ్ల కింద‌ట‌

ఇప్పుడు ప్రియాంక‌కు 47 ఏళ్లు. ఆమె ఇర‌వైల‌లో ఉన్న‌ప్పుడే పార్టీ బాధ్య‌త‌ల అప్ప‌గింత చ‌ర్చ‌కు వ‌చ్చింది. ప్రియాంక‌లో ఇందిరా గాంధీని చూస్తారు దేశ‌ప్ర‌జ‌లు… అని సీనియ‌ర్లు మంచి విశ్లేష‌ణ‌నే చేశారు. అప్పుడు ఆమె రాక‌కోసం ఎదురు చూసిన వాళ్లు దేశంలో ఎక్కువ‌గానే ఉన్నారు కూడా. అప్పుడు అది ప్ర‌భావ‌వంత‌మైన అస్త్రమే.

కాలం గ‌డిచేకొద్దీ కొత్త వెర్ష‌న్ లు వ‌చ్చి పాత వెర్ష‌న్ కంప్యూట‌ర్‌ను ఎక్సేంజ్‌లో తీసేయాల్సిన త‌రం ఇది. ప్రియాంక‌ రాజ‌కీయాల్లో అడుగుపెట్ట‌డం దాదాపుగా ఒక త‌రం ఆల‌స్య‌మైంద‌నే చెప్పాలి. ఇప్ప‌టి ఆరంగేట్రం అన్న‌య్య కోసం త్యాగానికే త‌ప్ప ఆమెకు లాభించేదేమీ ఉండ‌దు. ఈ వైఫ‌ల్య‌పు అనుభ‌వాల‌తో వెనుకడుగు వేయ‌కుండా కొన‌సాగితే 2024 నాటికి ఆమె గొప్ప రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ప‌రిణ‌తి చెంద‌డానికి పూర్తి అవ‌కాశాలున్నాయి. అయితే అప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీలో ప్ర‌ధాని అభ్య‌ర్థి ప్రియాంక అనే ప్ర‌తి పాద‌న బ‌తికే ఉంటుందా?

– మంజీర‌

First Published:  25 Jan 2019 12:48 AM GMT
Next Story