క్రీడా పద్మాలు మన తెలుగు తేజాలు

  • హారిక, శరత్ కమల్ లకు పద్మశ్రీ అవార్డులు
  • మహిళ చెస్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక
  • టేబుల్ టెన్నిస్ లో భారత సూపర్ స్టార్ శరత్ కమల్

భారత్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, గౌరవాన్ని తీసుకు వచ్చిన తెలుగుతేజాలు ద్రోణవల్లి హారిక, ఆచంట శరత్ కమల్, హైదరాబాద్ లో జన్మించిన భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ చెత్రీలతో సహా… తొమ్మిది మంది క్రీడాకారులను ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలతో గౌరవించింది.70వ గణతంత్ర వేడుకల సందర్భంగా పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించారు.

చెస్ క్వీన్ హారిక….

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో జన్మించి…ఆరేళ్ల ప్రాయంలోనే చదరంగ ఓనమాలు దిద్దుకొన్న ద్రోణవల్లి హారిక ప్రపంచ స్థాయి విజయాలతో అతిస్వల్పకాలంలోనే గ్రాండ్ మాస్టర్ హోదా సంపాందించింది.

ప్రపంచ మహిళల చెస్ పోటీల్లో మూడు కాంస్య పతకాలతో పాటు…2011లో గ్రాండ్ మాస్టర్ హోదా అందుకొంది. అంతేకాదు ఆసియా క్రీడల చెస్ లో దేశానికి కాంస్య పతకం సైతం సంపాదించి పెట్టింది.

దేశానికి పలువిధాలుగా ఖ్యాతి తెచ్చిన హారిక 28 ఏళ్ల చిరుప్రాయంలోనే పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావడం ద్వారా… తెలుగురాష్ట్రాలకే గర్వకారణంగా నిలిచింది.

టీటీ స్టార్ శరత్ కమల్….

ఇక…భారత టేబుల్ టెన్నిస్ ను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన మరో తెలుగుతేజం ఆచంట శరత్ కమల్ సైతం…పద్మశ్రీ పురస్కారాన్ని సాధించాడు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జన్మించి… చెన్నై కేంద్రంగా టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడుగా మెరుగులు దిద్దుకొన్న శరత్ కమల్… అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పలు పతకాలు అందించాడు.

ఇటీవలే ముగిసిన గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో సైతం.. శరత్ కమల్ అత్యుత్తమంగా రాణించడం ద్వారా…పద్మశ్రీ పురస్కారానికి అర్హత సంపాదించాడు.

సాకర్ కింగ్ సునీల్ చెత్రీ….

హైదరాబాద్ లో జన్మించి, బెంగాల్ లో ఫుట్ బాల్ క్రీడాకారుడిగా, భారత కెప్టెన్ గా ఎదిగిన సునీల్ చెత్రీకి సైతం…భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

భారత్ తరపున వంద అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన రెండో పుట్ బాలర్ గా, అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా సునీల్ చెత్రీకి గుర్తింపు ఉంది. భారత ఫుట్ బాల్ కు సునీల్ చెత్రీ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది.

తొమ్మిది మందికే క్రీడా పద్మాలు

పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ఇతర క్రీడాప్రముఖుల్లో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్, భజరంగ్ పూనియా, బోంబేలా దేవి, ప్రశాంతి సింగ్, అజయ్ ఠాకూర్ సైతం ఉన్నారు.

దేశంలోని వివిధ రంగాలకు చెందిన మొత్తం 112 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించగా… ఇందులో తొమ్మిది మంది మాత్రమే క్రీడాకారులు ఉండటం విశేషం.