అత్యాచారం చేసి ఆపై బండతో మోది…. గుంటూరు జిల్లాలో దారుణం

గుంటూరు జిల్లా రెంటచింతలలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడో యువకుడు. బాలికపై ఘాతుకానికి ఒడిగట్టిన జయరావు అనే యువకుడు అంతటితో ఆగలేదు. అత్యాచారం చేసిన తర్వాత బాలిక ముఖంపై బండరాయితో దాడి చేశాడు.

అర్థరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. బాత్‌రూంకు వెళ్లేందుకు ఇంటి నుంచి బాలిక బయటకు రాగా… అక్కడే ఉన్న జయరావు ఆమె నోరు మూసేసి ఊరి బయటకు లాక్కెళ్లాడు.

ఆ సమయంలో జయరావు మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. అరిస్తే చంపేస్తానంటూ బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. యువతి కేకలు వేయడంతో రాయి తీసుకుని ముఖం మీద బాదాడు. అనంతరం పారిపోయాడు.

యువతి కేకలు విన్న తల్లిదండ్రులు వెళ్లి చూడగా అప్పటికే జయరావు పారిపోయాడు. గాయపడిన బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.

నిందితుడు జయరావును అరెస్ట్ చేయాలంటూ బంధువులు, స్థానికులు మాచర్లలో ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు జయరావును పట్టుకునేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు.