ఫ్లాప్ హీరోయిన్ కు కోటి 70 లక్షలు

హీరోల రెమ్యూనరేషన్ సంగతులు కాసేపు పక్కనపెట్టేద్దాం. హీరోయిన్ల పారితోషికాల విషయంలో ఉన్న చిన్న లాజిక్ గురించి మాట్లాడుకుందాం. సినిమాలు ఫ్లాప్ అయితే హీరో సంగతి పక్కనపెడితే హీరోయిన్ కు మాత్రం క్రేజ్ తగ్గిపోతుంది. దాంతో పాటు పారితోషికం కూడా తగ్గిపోతుంది. ఇది అత్యంత సహజమైన విషయం. కానీ దీనికి రివర్స్ లో వెళ్తోంది పూజా హెగ్డే. పెద్దగా హిట్స్ లేకపోయినా సినిమాకు కోటి 70 లక్షల రూపాయలు తీసుకుంటోంది.

ఒక లైలా కోసం, ముకుంద, దువ్వాడ జగన్నాథమ్, సాక్ష్యం.. ఈ సినిమాలేవీ హిట్ కాదు. వీటితో కంపేర్ చేసి చూస్తే రీసెంట్ గా వచ్చిన అరవింద సమేత ఓ మోస్తరు హిట్ గా చెప్పుకోవాలి. కానీ అది కూడా ఎన్టీఆర్ రేంజ్ హిట్ అయితే కాదు. ఈ ఒక్క విషయానికే తన రేటును రెట్టింపు చేసింది పూజా హెగ్డే. ప్రస్తుతం మహేష్ తో చేస్తున్న మహర్షి సినిమాకు ఆమెకు కోటి 70లక్షల రూపాయలు సమర్పించుకున్నారని టాక్.

అయితే తన ప్రతి సినిమాకు పూజా ఇంతే మొత్తం తీసుకుంటుందని చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ చిన్న మెలిక ఉంది. మహర్షి సినిమా ఎంతో ప్రత్యేకం. మహేష్ కు ఇది 25వ చిత్రం. పైగా ముగ్గురు బడా నిర్మాతలు కలిసి చేస్తున్న సినిమా. మరీ ముఖ్యంగా లార్జర్ దేన్ లైఫ్ స్టోరీ. అందుకే ఈ సినిమాకు ఎన్ని కాల్షీట్లు పడతాయో చెప్పలేకపోతున్నారు నిర్మాతలు. అందుకే ఎప్పుడు అడిగితే అప్పుడు కాల్షీట్లు ఇవ్వాలనే ఒప్పందం మీద పూజాకు ఇంత మొత్తం ఇచ్చారట మేకర్స్. అదీ సంగతి.