చప్పగా సాగబోతున్న వీకెండ్

వీకెండ్ వచ్చిందంటే ఏదో ఒక సినిమా విడుదలవుతుంది. ప్రతి వీకెండ్ కాస్తోకూస్తో బజ్ ఉన్న సినిమానే థియేటర్లలోకి వస్తుంది. కానీ ఈ వీకెండ్ మాత్రం చప్పగా సాగబోతోంది. పెద్దగా పబ్లిసిటీ లేకుండా, జనాలకు కూడా తెలియకుండా 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవే రహస్యం, సకలకళా వల్లభుడు.

సాగర్ శైలేష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం “రహస్యం”. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది. కొత్త తరహా కథాంశంతో థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో ఈ సినిమా రూపొందిందని… సాగర్ హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా చక్కని ప్రతిభ కనబర్చాడని అంటున్నారు నిర్మాతలు. తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా థియేటర్లలో ఈ సినిమా రాబోతోంది.

రేపు రిలీజ్ అవుతున్న మరో సినిమా సకలకళా వల్లభుడు. తనిష్క్ రెడ్డి, మేఘాల గుప్తా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్ టైనర్. సుమన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాతో శివగణేష్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. దీనికి కూడా దాదాపు 70 థియేటర్లు దొరికాయి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.