Telugu Global
National

ఈ బడ్జెట్‌ పై ఆశలు అనవసరం

నరేంద్ర మోడీ ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రవేశపెట్టబోతున్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ లో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి కేటాయింపులు జరపబోతున్నారు? అనే అంశం పై రెండు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది బడ్జెట్‌ లో తమకు అన్యాయం జరిగిందని రెండు రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. విభజన చట్టం ప్రకారం తమకు సుమారు 16, 000 కోట్ల రెవెన్యూ లోటు వచ్చిందని, దానిని పూరించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరుతోంది. అయితే అంత రెవెన్యూ […]

ఈ బడ్జెట్‌ పై ఆశలు అనవసరం
X

నరేంద్ర మోడీ ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రవేశపెట్టబోతున్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ లో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి కేటాయింపులు జరపబోతున్నారు? అనే అంశం పై రెండు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

గత ఏడాది బడ్జెట్‌ లో తమకు అన్యాయం జరిగిందని రెండు రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.

విభజన చట్టం ప్రకారం తమకు సుమారు 16, 000 కోట్ల రెవెన్యూ లోటు వచ్చిందని, దానిని పూరించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరుతోంది. అయితే అంత రెవెన్యూ లోటు లేదని, రాష్ట్రప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడానికి పెట్టే ఖర్చు రెవెన్యూ లోటు కిందకు రాదని కేంద్రం వాదిస్తోంది. రుణమాఫీని కూడా రెవెన్యూ లోటులో కలపడం ఏమిటని ప్రశ్నిస్తోంది.

రాజధాని నిర్మాణానికి గత మూడు బడ్జెట్లలో 2,500 కోట్లు కేంద్రం కేటాయించింది. వాటికి సంబందించి సరైన యూసీలను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ సమర్పించలేదని కేంద్రం చెబుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ బడ్జెట్ లో ఎంత కేటాయింపు ఉంటుందో చూడాలి.

విభజన హామీల్లో భాగంగా పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తానని చెప్పింది. అయితే మీరు నిధులిస్తే మేమే నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్రం అందుకు అంగీకరించి…. కేంద్రం ఇప్పటి వరకు 7,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

అయితే ప్రాజెక్టు వ్యయం అమాంతం పెరిగిపోవడంతో కేంద్రం, రాష్ట్రం మధ్య ఈ విషయంలో విభేదాలు తలెత్తాయి. రాష్ట్రం చెబుతున్న లెక్కలకు, కేంద్రం ఇస్తానంటున్న నిధులకు పొంతన లేదు. మరి ఈ బడ్జెట్‌లో ఎంత కేటాయిస్తారో చూడాలి.

మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో రోడ్ ప్రాజెక్ట్ ల కోసం ఇప్పటివరకు 1.25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. కేంద్ర ప్రభుత్వం అనంతపురం నుంచి అమరావతికి 500 కి. మీ. ల అరు లైన్ల రహదారి కోసం రూ.20,000 కోట్ల కేటాయించింది.

కేంద్ర ప్రభుత్వం రూ.2,242 కోట్ల వ్యయంతో 10 ప్రాజెక్టుల పనులు 2018 అక్టోబర్ నాటికి పూర్తి చేసింది.

కేంద్రం ఏపీకి 9.59లక్షల ఇళ్లు మంజూరు చేసింది. ఇందుకు గాను 14, 414 కోట్లు మంజూరు చేశారు. కానీ ఏపీ ప్రభుత్వం కట్టింది మాత్రం లక్షా 9వేల, 969 ఇళ్ళు మాత్రమే.

అలాగే రాజధాని నిర్మాణం, విశాఖ రైల్వే జోన్‌, ఎయిమ్స్, ఐఐటి, కేంద్రీయ విశ్వవిద్యాలయం, పెట్రోలియం యూనివర్సిటీ, ఐఐఎం, డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఎన్ఐటి, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఐఎస్ఈఆర్, గిరిజన విశ్వవిద్యాలయం, హైదరాబాద్- అమరావతి మధ్య రాపిడ్ రైల్, రోడ్ కనెక్టివిటీ, విజయవాడ- గుంటూరు- తెనాలి మెట్రో రైలు, విశాఖ మెట్రో రైలు, విశాఖ- విజయవాడ- తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాలు, కడప ఉక్కు కర్మాగారం, విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్, దుగరాజపట్నం పోర్టు…. మొదలైన హామీల్లో చాలా వరకు నెరవేర లేదని ఏపీ ప్రభుత్వం విమర్శిస్తోంది.

అయితే కేంద్రం హామీ ఇచ్చిన పదకొండు విద్యాసంస్థలకు నిధులు మంజూరు చేశామని, ఇచ్చిన డబ్బుకు యుటిలిటీ సర్టిఫికేట్లు ఇస్తే తరువాత విడత నిధులు మంజూరు చేస్తామని, కానీ ఏపీ ప్రభుత్వం సరైన యూసీలు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు. మిగిలిన సంస్థలను కూడా త్వరలో ప్రారంభిస్తామని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏడు జిల్లాలను కేంద్రం వెనుకబడిన జిల్లాలుగా గుర్తించింది. వాటికి రెండు బడ్జెట్లలో రూ. 1,050 కోట్ల నిధులు కేటాయించారు. అయితే ఆ నిధులను రాష్ట్రం దారి మళ్ళించిందని ఆయా జిల్లాల అభివృద్ధికి ఖర్చు పెట్టలేదని కేంద్రం అంటోంది.

ఏడాది క్రితం వరకు కేంద్రంతో సఖ్యతగా ఉన్న ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేస్తూ కేంద్రం నుంచి ఏ రాష్ట్రమూ పొందనన్ని నిధులు తాము పొందామని చంద్రబాబు ప్రకటన చేశారు. బీజేపీతో తెగదెంపుల తరువాత కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏమీ చేయలేదని అదే చంద్రబాబు చెప్పడం గందరగోళంగా ఉంది.

తెలంగాణ కోరుతున్నదేమిటి?

తెలంగాణ ఎక్కువ నిధులు కోరుతున్నదే గానీ…. ఇవ్వాల్సింది ఇవ్వలేదని కేంద్రాన్ని నిలదీయడం లేదు. పోలవరానికి ఇచ్చినట్లే కాళేశ్వరం ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా భావించి నిధులు ఇవ్వాలని కోరుతోంది. అలాగే మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు నిధులు కోరుతోంది.

తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో కోరుతున్న ఎయిమ్స్‌ను కేంద్ర మంత్రి వర్గం ఇటీవల ఆమోదించింది.

విభజన సందర్భంగా కేంద్రం ప్రకటించిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, భూపాలపల్లి గిరిజన విశ్వవిద్యాలయం, హార్టికల్చర్‌ యూనివర్శిటీలకు ఇంకా కొన్ని నిధులు రావాల్సి ఉంది. ఈ బడ్జెట్ లో ఎంత కేటాయిస్తారో చూడాలి.

తెలంగాణలో తొమ్మిది జిల్లాలను కేంద్రం వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి 2015-16, 2016-17 లలో నిధులు కేటాయించారు. పోయిన బడ్జెట్‌లో ఆ ఊసే లేదు. ఈ బడ్జెట్‌ లో నిధులకోసం తెలంగాణ ఎదురుచూస్తోంది.

ఏది ఏమైనా ఇది నాలుగు నెలల బడ్జెట్‌. ఎన్నికల బడ్జెట్. ఈ బడ్జెట్ లో ఓటర్లను ఆకర్షించే కేటాయింపులు ఉంటాయి తప్ప… రాష్ట్రాలకు ఉపయోగపడే నిధుల కేటాయింపులు పెద్దగా ఉండక పోవచ్చు. కాబట్టి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఆశలు నెరవేరే అవకాశాలు తక్కువ.

First Published:  31 Jan 2019 3:24 AM GMT
Next Story