Telugu Global
NEWS

మోదీ సాబ్‌.... తీర్పు చెప్పండి

ప్ర‌ధాని మోదీ గొప్ప ప్రెజెంటేట‌ర్‌. గొప్ప మార్కెటింగ్ స్ట్రాట‌జిస్ట్‌. ఒక విష‌యాన్ని ఆయ‌న పండు ఒలిచి చేతిలో పెట్టినంత చ‌క్క‌గా చిలుక‌ప‌లుకుల్లో ప‌లికేస్తారు. అలాగే సూర‌త్ ప‌ర్య‌ట‌న‌లో కూడా జాతి యావ‌త్తూ ఆయ‌నకు పాదాభివంద‌నం చేసేటంత ధారాళంగా హామీలిచ్చేశారు. అవి తాయిలాలు కాదు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం ఇచ్చిన హామీలు. సెక్సువ‌ల్ అసాల్ట్‌కు పాల్ప‌డిన మ‌గ‌వాళ్ల‌ను మూడు రోజుల్లో, ఏడు రోజుల్లో, ప‌ద‌కొండు రోజుల్లో లేదా ముప్పై రోజుల్లో శిక్షిస్తామ‌ని చెప్పారు. ఈ మాట‌ల ద్వారా ఆయ‌న […]

మోదీ సాబ్‌.... తీర్పు చెప్పండి
X

ప్ర‌ధాని మోదీ గొప్ప ప్రెజెంటేట‌ర్‌. గొప్ప మార్కెటింగ్ స్ట్రాట‌జిస్ట్‌. ఒక విష‌యాన్ని ఆయ‌న పండు ఒలిచి చేతిలో పెట్టినంత చ‌క్క‌గా చిలుక‌ప‌లుకుల్లో ప‌లికేస్తారు. అలాగే సూర‌త్ ప‌ర్య‌ట‌న‌లో కూడా జాతి యావ‌త్తూ ఆయ‌నకు పాదాభివంద‌నం చేసేటంత ధారాళంగా హామీలిచ్చేశారు. అవి తాయిలాలు కాదు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం ఇచ్చిన హామీలు. సెక్సువ‌ల్ అసాల్ట్‌కు పాల్ప‌డిన మ‌గ‌వాళ్ల‌ను మూడు రోజుల్లో, ఏడు రోజుల్లో, ప‌ద‌కొండు రోజుల్లో లేదా ముప్పై రోజుల్లో శిక్షిస్తామ‌ని చెప్పారు. ఈ మాట‌ల ద్వారా ఆయ‌న మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు త‌మ ప్ర‌భుత్వం ఎంత‌గా క‌ట్టుబ‌డి ఉందో చెప్పారు.

ఈ మాట ఇప్పుడే కాదు అప్పుడ‌ప్పుడూ చెబుతూనే ఉన్నారు. ఎన్నిక‌ల శంఖారావం పూరించ‌డానికి ముందు పూన‌కం వ‌చ్చిన‌ట్లు ప్ర‌క‌టించే హామీల్లో మ‌హిళ‌ల భ‌ద్ర‌త కూడా ప్ర‌ధానాంశంగానే ఉంటోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని కేసులు ప‌రిశీలించారు, తీర్పులిచ్చారు? ఎంత‌మందిని ఉరి తీశారు?

2004లో….

మ‌న‌దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు చోటు చేసుకున్న వాటిలో 2014 నాటి ధ‌నుంజ‌య్ చ‌ట‌ర్జీ ఉరితీతే ఆఖ‌రుది. ధ‌నుంజ‌య్ ప‌ద్నాలుగేళ్ల అమ్మాయిని రేప్ చేసి హ‌త‌మార్చిన కార‌ణంగా అత‌డికి ఉరిశిక్ష వేసింది న్యాయ‌స్థానం. అయితే ఆ ఉరిని అమ‌లు చేసేట‌ప్పుడు మేధావులంతా తీవ్రంగా చ‌ర్చించారు. ప్రాణానికి ప్రాణం తీయ‌డం నాగ‌ర‌క‌త కాదు ఆట‌వికం అని గొంతు విప్పారు. కానీ మ‌హిళ‌లు ఆగ్ర‌హావేశాల ముందు ఆ గొంతుక‌లు క్ర‌మంగా మౌనం దాల్చాయి.

వ‌ర్త‌మానంలోకి వ‌స్తే… మ‌హిళ‌లు, పిల్ల‌ల మీద లైంగిక దాడికి పాల్ప‌డిన వాళ్ల‌ను తొమ్మిది మందిని విచారించి మ‌ర‌ణ‌శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది న్యాయ‌స్థానం. ఆ శిక్ష అమ‌ల‌య్యేదెప్పుడో మోదీకే తెలియాలి. సాధార‌ణంగా మ‌న న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో మ‌ర‌ణ‌శిక్ష ప‌డిన నిందితులు క్ష‌మాభిక్ష కోర‌వ‌చ్చు. ఆ క్ష‌మాభిక్ష ఫైళ్లు సుప్రీంకోర్టులోనూ, ప్రెసిడెంట్ ద‌గ్గ‌ర నెల‌లు, ఏళ్లు పెండింగ్‌లో ఉంటాయి. దేశం మొత్తం అట్టుడికిపోయిన ఉరి, క‌ఠువా రేప్ కేసు నిందితుల్ని ఏం చేశారు?

కేసు ట్రాక్ ఎక్కేదెప్పుడు

ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల‌ను ఏర్పాటు చేసి మ‌రీ ఈ లైంగిక దాడుల కేసుల‌ను విచారిస్తామ‌ని చెప్ప‌డం, విన‌డం చెవుల‌కు ఇంపుగానే ఉంటుంది. కానీ ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న కేసుల‌ను విచారించ‌డానికి 1,800 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అవ‌స‌రం. ఇప్పుడు ఉన్న‌వి 722. మ‌రి మిగిలిన కేసుల‌ను విచారించాలంటే వెయ్యికి పైగా కోర్టుల‌ను ఏర్పాటు చేయాలి.

నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2016 ప్ర‌కారం ఆ ఏడాది 55వేల‌కు పైగా రేప్‌, చైల్డ్ అబ్యూస్‌ కేసులు న‌మోద‌య్యాయి. అంత‌కు ముందువి ప‌ద‌హారు వేలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ మొత్తంలో చార్జిషీట్ ఫైల్ చేసిన‌వి 33 వేల కేసులే. మిగిలిన‌వి పెండింగ్‌లో ఉండ‌గా, మ‌ళ్లీ ఈ రెండేళ్ల‌లో ఎన్ని కేసులు న‌మోద‌య్యాయో అధికారిక లెక్క‌లు విడుద‌ల కావ‌డం లేదు.

ఇదిలా ఉండే… గ‌త ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్ర‌భుత్వం కేసుల ద‌ర్యాప్తుకు రెండు నెల‌ల స‌మ‌యం, విచారణ‌కు మ‌రో రెండు నెల‌ల స‌మ‌యం ఇవ్వ‌డానికి అంగీక‌రించింది. ఒక‌వైపు ప్ర‌భుత్వం పోలీసు, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల‌కు నాలుగు నెల‌ల స‌మ‌యం ఇచ్చి, వేదిక‌ల మీద ”మూడు రోజుల్లో వెతికి ప‌ట్టుకుంటాం. నెల‌రోజుల్లో ఉరితీస్తాం” అంటే విన‌డానికి బాగానే ఉంటుంది. న‌మ్మ‌డానికే క‌ష్టంగా ఉంటుంది.

వేడి చాయ్ అంటూ

ట్రైన్‌లో వేడి వేడి చాయ్‌, గ‌ర‌మ్ గ‌ర‌మ్ చాయ్ అని న‌మ్మ‌కంగా అమ్ముతుంటారు చాయ్‌వాలాలు. ఆ మాట‌లు న‌మ్మి చాయ్ తీసుకుంటే క‌ప్పు గోరువెచ్చ‌గా హెచ్చ‌రిస్తుంది. కొన్నాం క‌దా తాగ‌క త‌ప్పుతుందా అని సిప్ చేస్తే… అవి చ‌ల్లారిపోయి అర్థ‌గంట దాటిన‌ట్లు ఎవ‌రూ చెప్ప‌క‌నే తెలిసిపోతుంది. ”గ‌ర‌మ్ గ‌ర‌మ్ అన్నావు క‌దా, వేడి లేదేమిటి” అని అడుగుదామంటే చాయ్‌వాలా మ‌న‌ల్ని దాటి ముందుకు వెళ్లి పోయి ఉంటాడు.

-మంజీర‌

First Published:  31 Jan 2019 11:28 PM GMT
Next Story