Telugu Global
National

నాడు వాజ్‌పేయి " నేడు రాహుల్‌

రాహుల్ గాంధీని చూస్తుంటే వాజ్‌పేయి గుర్తొస్తుంటారు. ఇద్ద‌రూ కెమెరాకు సూట‌య్యే ప‌ర్స‌నాలిటీలే. విజువ‌ల్ మీడియాకి రిచ్‌విజువ‌ల్‌గా ప‌నికొస్తారు. ఒక విషయంలో ఇద్ద‌రి మెద‌ళ్లు కూడా ఒకటే ర‌కంగా ఉన్నాయా అనే సందేహం అప్పుడ‌ప్పుడూ క‌లుగుతుంటుంది. ఇప్పుడు తాజాగా జ‌నాభాకు ఆదాయ భ‌ద్రత క‌ల్పిస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం హైలైట్‌. దారిద్ర్య రేఖ‌కు దిగువ‌న ఉన్న వారికి ఆదాయ భ‌ద్ర‌త క‌ల్పించాలంటే ఏడాదికి ఏడు ల‌క్ష‌ల కోట్లు అవుతాయ‌ని నిపుణుల అంచ‌నా. గ‌త ఏడాది దేశ బ‌డ్జెట్ పాతిక ల‌క్ష‌ల కోట్లకు […]

నాడు వాజ్‌పేయి  నేడు రాహుల్‌
X

రాహుల్ గాంధీని చూస్తుంటే వాజ్‌పేయి గుర్తొస్తుంటారు. ఇద్ద‌రూ కెమెరాకు సూట‌య్యే ప‌ర్స‌నాలిటీలే. విజువ‌ల్ మీడియాకి రిచ్‌విజువ‌ల్‌గా ప‌నికొస్తారు. ఒక విషయంలో ఇద్ద‌రి మెద‌ళ్లు కూడా ఒకటే ర‌కంగా ఉన్నాయా అనే సందేహం అప్పుడ‌ప్పుడూ క‌లుగుతుంటుంది.

ఇప్పుడు తాజాగా జ‌నాభాకు ఆదాయ భ‌ద్రత క‌ల్పిస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం హైలైట్‌. దారిద్ర్య రేఖ‌కు దిగువ‌న ఉన్న వారికి ఆదాయ భ‌ద్ర‌త క‌ల్పించాలంటే ఏడాదికి ఏడు ల‌క్ష‌ల కోట్లు అవుతాయ‌ని నిపుణుల అంచ‌నా. గ‌త ఏడాది దేశ బ‌డ్జెట్ పాతిక ల‌క్ష‌ల కోట్లకు లోపే. ఈ ప్ర‌క‌ట‌న చూసిన వెంట‌నే అప్ప‌ట్లో వాజ్‌పేయి ఉదారంగా ఇచ్చిన హామీ ఒక‌టి గుర్తుకు వ‌స్తోంది.

ఫండా… గ్రాంటా!

అది వాజ్‌పేయి ప్ర‌ధాని అయిన తొలిరోజులు (ప‌ద‌మూడు రోజుల ప్ర‌భుత్వం కాదు). ప్రకృతి విల‌యం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అత‌లాకుత‌లం చేసింది. ప్ర‌ధాన‌మంత్రి హోదాలో వాజ్‌పేయి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో ఆకాశంలో ప‌ర్య‌టించి జ‌రిగిన విల‌యానికి తీవ్రంగా చింతించారు. అప్ప‌టికి ఇంకా ఆయ‌న‌లో క‌వి నిద్ర‌పోయి పాల‌కుడు నిద్ర‌లేవ‌లేదు. అప్ప‌టిక‌ప్పుడే రెండు వంద‌ల కోట్ల ఫండ్‌ను ప్ర‌క‌టించేశారు.

ఈ ప్ర‌క‌ట‌న తెలిసి ఢిల్లీలో మంత్రివ‌ర్గం ల‌బోదిబోమ‌న్న‌ది (ఇర‌వై ఏళ్ల కింద‌ట అప్ప‌టి బ‌డ్జెట్‌కి అది పెద్ద మొత్తం). విప‌త్తు నిధి నుంచి రెండు వంద‌ల కోట్లు ఫండ్ ఒక్క‌చోట‌నే ఇచ్చేస్తే మిగిలిన రాష్ట్రాల్లో ఎదుర‌య్యే విప‌త్తుల‌కు ఎక్క‌డ నుంచి తెచ్చివ్వాలి… అని మొత్తుకున్నారు.

ఆఖ‌రికి ”పెద్దాయ‌న‌కు తెలియ‌లేదు. అది ఫండ్ కాదు, గ్రాంట్” అని ముక్తాయించేశారు. ఇదేంటి మ‌హాప్ర‌భో అది ఫండా గ్రాంటా తేల్చి చెప్పండి అని టీవీ కెమెరాలు వాజ్‌పేయి మీద ఫోక‌స్ అయ్యాయి. అప్పుడు వాజ్‌పేయి ఆశుక‌విత్వం చెప్ప‌డానికి క‌ళ్లు మూసుకుని ఆలోచించిన‌ట్లే… క‌ళ్లు మూసుకుని కొన్ని క్ష‌ణాలు ఆగి క‌ళ్లు తెరిచి ”రిలీఫ్ ఫండ్ కాదు, రాష్ట్రానికి కేంద్రం విడుద‌ల చేసే గ్రాంటును త‌క్ష‌ణ అవ‌స‌రం కోసం ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాం” అని మంత్రివ‌ర్గం చెప్ప‌మ‌న్న మాట‌నే చెప్పారు.

ఈ లోపు… రెండో స్టేట్‌మెంట్ ఇలా ఇస్తాడ‌ని ఊహించ‌క‌, బిజెపితో అంట‌కాగుతున్న అధికార పార్టీకి అనుబంధంగా ప‌ని చేసిన ప‌త్రిక‌లు కొన్ని ”ఓహో వాజ్‌పేయి, ఆహా వాజ్‌పేయి” అని ఆకాశానికెత్తేశాయి. ఫండ్ కాదు గ్రాంటు అని ఢిల్లీ నుంచి కొత్త బులెటిన్ వెలువ‌డ్డాక ఆకాశానికి ఎత్తిన చేతుల‌తోనే దించి కింద‌ప‌డేయ‌లేక క‌ళ్లు మిట‌క‌రించాయి. ఈ లోపు కొన్ని కెమెరాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి ముందు వాలాయి. అప్పుడు ఆయ‌న‌… ”ఇన్నేళ్ల‌లో నేను ఏమాత్రం అవ‌గాహ‌న లేని ఇలాంటి ప్ర‌ధాన‌మంత్రిని చూడ‌లేదు” అన్నారు విజ‌య‌భాస్క‌ర‌ రెడ్డి.

సొంత ప‌లుకులు ఎప్ప‌టికి ప‌లుకునో!

ఇప్పుడు రాహుల్ చెప్తున్న సంక్షేమ ప‌థ‌కానికి ఏడు ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చ‌యితే, ఇక డిఫెన్స్‌, పోలీస్‌, ప‌బ్లిక్ హెల్త్‌, ఎడ్యుకేష‌న్‌, ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి సాధార‌ణ ఖ‌ర్చుల‌కు డ‌బ్బు ఎలా స‌ర్దాలి. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం వంటి అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు కేటాయింపులు ఎలా? అనే ఇంగితం లేకుండా ఎన్నిక‌లు వ‌స్తున్నాయి కాబ‌ట్టి… ముందు ఏదో ఒక‌టి జ‌నానికి న‌చ్చే మాట‌ చెప్పేద్దాం అన్న‌ట్లు చెప్పించిన‌ట్లున్నారు.

ఆ పార్టీ పెద్ద‌లు చెప్ప‌మ‌న్న మాట‌ల‌నే తు.చ త‌ప్ప‌కుండా ప‌లికిన‌ట్లున్నారు రాహుల్‌. గ‌త ఎన్నిక‌ల్లో కూడా ఆ పార్టీ రాహుల్ చ‌రిష్మా పెంచ‌డానికి నానా క‌ష్టాలు ప‌డింది ఆ పార్టీ. జ‌నం మీద మోపిన బాదుడు మ‌న్‌మోహ‌న్ ఖాతాలో ప‌డేసి, తాయిలాలు రాహుల్ ఖాతాలో వేయ‌డానికి గొప్ప వ్యూహాన్నే రాశార‌ప్ప‌ట్లో. ఎల్పీజీ గ్యాస్‌ స‌బ్సిడీ సిలిండ‌ర్‌ల‌ను తొమ్మిది నుంచి ఆరుకి త‌గ్గింప‌చేసింది ఆ పార్టీ మ‌న్‌మోహ‌న్ సింగ్ చేత‌. అది బెడిసి కొట్టింద‌ని ఆచ‌ర‌ణ‌లో స్ప‌ష్ట‌మైంది. ఈ లోపు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయి.

అప్పుడు రాహుల్ చేత ”ఒక మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి ఏడాదికి ఆరు సిలిండ‌ర్‌లు ఎక్క‌డ స‌రిపోతాయి? క‌నీసం తొమ్మిదైనా ఉండాలి. స‌బ్సిడీ లేకుండా పూర్తి డ‌బ్బు చెల్లించి కొనాలంటే మ‌ధ్య త‌ర‌గ‌తి ఇల్లాలి ఇంటి బ‌డ్జెట్ మీద ఎంత బ‌రువో క‌దా! మా ప్ర‌భుత్వం వ‌స్తే తొమ్మిది సిలిండ‌ర్‌లు స‌బ్సిడీ తో ఇస్తాం” అని ప‌లికించారు. మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌హిళ‌ల మీద అంతులేని అభిమానాన్ని కురిపించే ప్ర‌య‌త్నం చేసింది ఆ పార్టీ…. కుటుంబం లేని రాహుల్ చేత‌.

రాహుల్ మంచి అబ్బాయిలాగ పార్టీ ప‌లికించిన‌ట్లే అప్పుడు ప‌లికాడు. అయితే అప్పుడు రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు కాదు, ఇప్పుడు అధ్య‌క్షుడు. ఇప్పుడు కూడా ఒక‌రు ప‌లికించిన ప‌లుకుల‌నే ప‌లుకుతుంటే సొంత వాక్యాలు ప‌లికేది ఎప్పుడో?

First Published:  31 Jan 2019 8:55 PM GMT
Next Story