150 కోట్లు, మంత్రి ప‌ద‌వి – ఆడియో టేపుల క‌ల‌క‌లం

క‌ర్నాట‌క‌లో మ‌రోసారి ఆడియో టేపుల క‌ల‌కలం రేగింది. త‌న ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోపిస్తూ వ‌స్తున్న క‌ర్నాట‌క సీఎం కుమార‌స్వామి తాజాగా ఆడియో టేపుల‌ను బ‌య‌ట‌పెట్టారు.

బడ్జెట్ ప్ర‌వేశ‌పెట్టాల్సిన రోజే సీఎం మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి ఆడియో టేపులు విడుద‌ల చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 150 కోట్ల‌తో పాటు, మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని బీజేపీ నేత‌లు హామీ ఇచ్చిన‌ట్టు స‌ద‌రు ఆడియో టేపుల్లో ఉంది. కుమార స్వామి ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు మూడు వారాల్లోనే రెండు సార్లు బీజేపీ ప్ర‌య‌త్నించిన‌ట్టు ఆడియో టేపుల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. మాజీ ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప‌… ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఈ ఆఫ‌ర్ ఇచ్చినట్టు ఆడియో టేపుల‌ను బ‌ట్టి తెలుస్తోంది.

న‌రేంద్ర మోడీ ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నార‌ని చెప్ప‌డానికి ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏం కావాల‌ని కుమార‌స్వామి ప్ర‌శ్నించారు. బీజేపీ త‌న ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అసెంబ్లీలో అవిశ్వాసం పెడితే ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో బ‌డ్జెట్ స‌మావేశాల‌కు త‌ప్ప‌కుండా హాజ‌రుకావాలంటూ కాంగ్రెస్, జేడీఎస్‌లు త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌కు విప్ జారీ చేశాయి.