సున్నితంగా హెచ్చరించిన యాత్ర దర్శకుడు

యాత్ర సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెకెక్కిన ఈ సినిమాకు అన్ని సెంటర్ల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మేకర్స్ అంతా హ్యాపీ. కానీ దర్శకుడు మహి వి రాఘవ్ మాత్రం ఈ సినిమా విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాడు. ఈరోజు పొద్దున్నే సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు రాఘవ్ పెట్టిన ట్వీట్ అందర్నీ ఆలోచింపజేసింది.

ఎవరైతే డబ్బులు పెట్టి యాత్ర సినిమా చూస్తారో వాళ్లందరికీ సినిమాపై స్పందించే హక్కు, ఫీడ్ బ్యాక్ ఇచ్చే అర్హత ఉందంటూ పోస్ట్ పెట్టాడు రాఘవ్. యాత్ర సినిమా చూసినందుకు థ్యాంక్స్ చెబుతూనే, పాజిటివ్, నెగెటివ్ ఫీడ్ బ్యాక్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు. నెగెటివ్ గా మాట్లాడాలని ఫిక్స్ అయినా, ట్రోల్ చేయాలని భావించినా అందుకు సిద్ధంగా ఉన్నానని, పోస్ట్ పెట్టేవారు కూడా రెడీగా ఉండాలనే అర్థం వచ్చేలా రియాక్ట్ అయ్యాడు.

ఎప్పుడు లేనిది మహి వి రాఘవ్ ఇలా రియాక్ట్ అవ్వడం వెనక ఓ చిన్న రీజన్ ఉంది. యాత్ర సినిమా రాజకీయాలతో ముడిపడిన చిత్రం. మరీ ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీ పార్టీలపై పరోక్షంగా విమర్శలు చేసిన చిత్రమిది. బ్రీఫ్డ్ మీ లాంటి డైలాగ్స్ తో పాటు మరో సీనియర్ కాంగ్రెస్ నేతను దెప్పిపొడుస్తూ కామెడీ చేసిన సన్నివేశాలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మహి వి రాఘవ్ ఈ ట్వీట్ చేశాడు. సినిమా విడుదలైన తర్వాత రాఘవ్ ఎందుకు ఈ పోస్ట్ పెట్టాడో అందరికీ అర్థమైంది.