ముస్లిమ్ యువకుడిగా ఎన్టీఆర్

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టుపై రోజుకో పుకారు నడుస్తోంది. నిన్నటికి నిన్న ఈ సినిమాలో చరణ్ పోలీస్ గా కనిపించబోతున్నాడంటూ ప్రచారం అందుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ముస్లిం యువకుడిగా కనిపించబోతతున్నాడట.

పునర్జన్మ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందంటూ చాలా రోజులుగా ప్రచారం నడుస్తోంది. గత జన్మలో అన్నదమ్ములుగా కలిసున్న చరణ్-ఎన్టీఆర్, మరో జన్మలో ఒకరు ముస్లిం యువకుడిగా, వేరొకరు పోలీస్ గా జన్మిస్తారట. ఇలా నడుస్తుందట ఆర్-ఆర్-ఆర్ స్టోరీలైన్.

ప్రస్తుతానికైతే ఈ సినిమాపై ఎలాంటి అప్ డేట్స్ లేవు. రెండో షెడ్యూల్ తో యూనిట్ బిజీగా గడిపేస్తోంది. హీరోయిన్లు ఎవరనే విషయాన్ని కూడా బయటపెట్టకుండా షూటింగ్ లో మునిగిపోయింది. విడుదలకు ఇంకా ఏడాది టైమ్ ఉంది కాబట్టి ఇప్పట్నుంచే అన్ని వివరాల్ని బయటపెట్టడం ఇష్టంలేక, ఇలా మీడియాకు దూరంగా తమ పని తాను చేసుకుంటోంది ఆర్-ఆర్-ఆర్ టీం.