సమంతా సినిమాలో అడివి శేష్

స్టార్ హీరోయిన్ సమంతా పెళ్లి తరువాత గ్లామర్ రోల్స్ కంటే కూడా పాత్రకి ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వస్తుంది. గత ఏడాది ఇలాంటి సినిమాలే చేసిన సమంతా…. ఈ ఏడాది కూడా ఒక వైవిధ్యమైన సినిమాతో మన ముందుకి రాబోతుంది.

నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఒక కొరియన్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది. “ఓ బేబీ ఎంత సక్కగున్నావే” అని టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు మరో హీరో కూడా వచ్చి చేరాడు. కానీ ఈ హీరో పాత్ర కేవలం ముఖ్యపాత్ర గానే ఉంటుందట. ఆ హీరో మరెవరో కాదు అడివి శేష్.

సమంతా, అడివి శేష్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇక ఈ స్నేహం కోసమే అడివి శేష్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించేందుకు ఒప్పుకున్నాడట. నందిని రెడ్డి ఇటీవలే అడివి శేష్, సమంతా లపై సన్నివేశాలు షూట్ చేసింది. సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు అలాగే గురు ఫిలిమ్స్ పై సునీత తాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.