అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రం

బాహుబలి-2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది 2.0 సినిమా. రజనీకాంత్, అక్షయ్ కుమార్ కలిసి నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమా వరల్డ్ వైడ్ 1800 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం, బాహుబలి-2ను క్రాస్ చేస్తుందని అంతా భావించారు. కానీ రాజమౌళి తీసిన బాహుబలి-2ను శంకర్ తీసిన 2.0 క్రాస్ చేయలేకపోయింది.

తమిళనాడులో ఈ సినిమాను వంద కోట్ల రూపాయలకు అమ్మితే, అక్కడ 120 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక ఏపీ,నైజాంలో ఈ సినిమాను 53 కోట్ల రూపాయలకు అమ్మగా ఫుల్ రన్ లో 83 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక కర్ణాటకలో 47 కోట్లు, కేరళలో 18 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టు స్పష్టంచేశారు.

ఒక్క ఇండియా నుంచే ఈ సినిమాకు 493 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. 470 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ విషయంలో సంచలనం సృష్టించింది. ఏకంగా 110 కోట్ల రూపాయలకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమాకు ఇంత మొత్తం దక్కలేదు.