హోర్డింగ్స్ పై ఎస్పీజీ సీరియ‌స్‌

గుంటూరులో నేడు ప్ర‌ధాని మోడీ రాక‌ను వ్య‌తిరేకిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో టీడీపీ నేత‌లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌పై మోడీ భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షించే ఎస్పీజీ తీవ్రంగా స్పందించింది. మోడీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో శ‌నివారం ఎస్పీజీ ఉన్న‌తాధికారులు గుంటూరులో ప‌ర్య‌టించారు.

ఈ సంద‌ర్భంగా మోడీ గో బ్యాక్ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌ను వారు ప‌రిశీలించారు. నిబంధ‌నల ప్ర‌కారం ఫ్లెక్సీల‌పై వాటిని ఏర్పాటు చేసిన వ్య‌క్తి, ప్ర‌చురించిన సంస్థ పేర్లు త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. కానీ ప్ర‌భుత్వ స‌హ‌కారం ఉండ‌డంతో ప్ర‌చ‌రించిన సంస్థ‌, వాటిని వేయించిన వ్య‌క్తుల పేర్లు లేకుండానే భారీ ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. దీనిపై ఎస్పీజీ సీరియ‌స్ అయింది.

కృష్ణా, గుంటూరు జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. ఫ్లెక్సీల‌ను వాటిని ఏర్పాటు చేసిన వ్య‌క్తులు, ముద్రించిన సంస్థ‌ల పేర్లు లేక‌పోయినా ఎలా అనుమ‌తించార‌ని ప్ర‌శ్నించారు. ఈ ఫ్లెక్సీల వెనుక ఏ శ‌క్తులు ఉన్నాయ‌ని ప్ర‌శ్నించారు. దీంతో రెండు జిల్లాల అధికారులు నీళ్లు న‌మిలారు. వెంట‌నే వాటిని తొల‌గించాల‌ని ఎస్పీజీ ఆదేశించ‌డంతో సాయంత్రం కొన్నింటిని తొల‌గించారు.