ఎమ్మెల్యే దారుణ హ‌త్య‌

బెంగాల్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. తృణమూల్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే స‌త్య‌జిత్ విశ్వాస్‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్చి చంపారు. అతి స‌మీపం నుంచే బుల్లెట్ల వ‌ర్షం కురిపించ‌డంతో యువ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయాడు.

న‌దియా జిల్లా పూల్బ‌రీలో స‌ర‌స్వ‌తి పూజ‌లు కార్య‌క్ర‌మంలో పాల్గొని వేదిక దిగుతున్న స‌మ‌యంలో ఈ దాడి జ‌రిగింది. దాడి జ‌రిగిన స‌మ‌యంలో ప‌క్క‌నే మంత్రి ర‌త్న‌ఘోష్ కూడా ఉన్నారు. కానీ దుండ‌గులు ఎమ్మెల్యే విశ్వాస్‌ను టార్గెట్‌గా చేసుకుని
విరుచుకుప‌డ్డారు.

ఘ‌ట‌న స్థ‌లిలోనే కుప్ప‌కూలిన ఎమ్మెల్యేను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే ఆయ‌న చ‌నిపోయిన‌ట్టు వైద్యులు నిర్దారించారు. విశ్వాస్ ప్ర‌స్తుతం కృష్ణగంజ్ నియోజ‌క‌ వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

ఈ హ‌త్య వెనుక బీజేపీ హ‌స్త‌ముందని తృణమూల్‌ కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ మాత్రం ఇది వారి పార్టీలో అంత‌ర్గ‌త పోరులో భాగంగానే జ‌రిగింద‌ని వ్యాఖ్యానించింది. ఈ హ‌త్య‌పై సీబీఐ చేత విచార‌ణ జ‌రిపించాల‌ని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేసింది.