త్వరలోనే లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన : సీఎల్పీ నేత భట్టి

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతోందని.. త్వరలోనే తెలంగాణ పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్ర స్థాయిలో ఎవరెవరితో పొత్తులు ఉంటాయనే దానిపై నెలాఖరు లోగా స్పష్టత వస్తుందని.. ఆ తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని ఆయన చెప్పారు.

ఇప్పటికే ఆశావహులు చాలా మంది టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని… వీరికి స్క్రీనింగ్ కమిటీ ఇంటర్వ్యూలు ఉంటాయని భట్టి స్పష్టం చేశారు. తెలంగాణలో పొత్తుల గురించి కూడా రాష్ట్ర నాయకులతో చర్చించి తమ అధిష్టానానికి పంపుతామని.. అభ్యర్థుల విషయంలో జాతీయ కమిటీదే తుది నిర్ణయమని భట్టి చెప్పారు.

ఇక రైతుల కష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. ఎర్రజొన్నలు కొనుగోలు చేశామని ప్రభుత్వం బూటకపు మాటలు చెబుతోందన్నారు. మరో వైపు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఎంపీ కవిత ఇచ్చిన హామీలు ఏమయ్యాయని భట్టి ప్రశ్నించారు.