మూడు రోజులు టైం ఇస్తున్నా…. త‌ప్పు సరి దిద్దుకోక‌పోతే….

టీడీపీ స‌త్తా ఏంటో చూపించేందుకే తాను ఢిల్లీలో దీక్ష‌కు దిగాన‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చెప్పారు. ఏపీ భ‌వ‌న్ వ‌ద్ద జ‌రిగిన దీక్ష‌లో ప్ర‌సంగించిన చంద్ర‌బాబు… డ‌బ్బు సంపాదించుకోవ‌డం త‌మ‌కు తెలుస‌ని.. కానీ ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నిస్తే మాత్రం స‌హించ‌బోన‌న్నారు.

గుంటూరులో ప్ర‌ధాని అద్దె జ‌నాన్ని వెంట‌పెట్టుకుని వ‌చ్చి స‌భ నిర్వ‌హించార‌న్నారు. త‌మ ప‌ట్ల వివ‌క్ష చూపాల‌ని చూస్తే మీ ఆట‌లు సాగ‌వ‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. పాల‌కులు ధ‌ర్మాన్ని మ‌రిచిపోయిన‌ప్పుడు గుర్తు చేయాల్సిన బాధ్య‌త ఉంద‌న్నారు. ప్ర‌ధాని మోడీ ధ‌ర్మాన్ని విడిచిపెట్టి ప‌రిపాల‌న చేస్తున్నాడ‌ని…. అందుకే గుర్తు చేయ‌డానికి తాము వ‌చ్చామ‌న్నారు.

చ‌ట్టంలో ఉన్న‌వి అమ‌లు చేయాల్సిందిగా కోరితే వ్య‌క్తిగ‌త దాడికి మోడీ దిగ‌డం స‌రైన చ‌ర్య కాద‌న్నారు. ధ‌ర్మాన్ని పాటించాల‌ని మోడీకి గ‌తంలో వాజ్‌పేయే సూచించార‌ని…. కానీ మోడీ మార‌డం లేద‌న్నారు. కేంద్రం ఇచ్చిన దానికి లెక్క‌లు చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని… అంతకంటే ముందు తాము క‌ట్టిన ప‌న్నుల‌కు మోడీ లెక్క‌లు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్ర‌శ్నించారు చంద్ర‌బాబు.

మెజారిటీ ఉంది క‌దా అని ఇష్ట‌మొచ్చిన‌ట్టు చేస్తామంటే స‌హించే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. ప‌ద‌వుల్లో ఉన్న వారు బాధ్య‌త‌తో ప‌నిచేయాల‌న్నారు. తాను పోరాటం చేస్తున్న‌ది త‌న కోసం కాద‌ని భావి త‌రాల కోసం పోరాటం చేస్తున్నాన‌ని చెప్పారు. ప్ర‌జ‌ల నాడి తెలియ‌ని వ్య‌క్తి మోడీ అని విమ‌ర్శించారు. ఏదో ఒక పార్టీని ప‌ట్టుకుంటే ఓట్లు వ‌స్తాయ‌ని భ్ర‌మ‌ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానించారు.

త‌న‌ను మోడీ విమ‌ర్శించాల‌నుకుంటే ఢిల్లీ నుంచే విమ‌ర్శించవ‌చ్చ‌ని… కానీ ఇంకా పుండు మీద కారం చ‌ల్లేందుకు గుంటూరు వ‌చ్చి స‌భ పెట్టార‌ని మండిప‌డ్డారు. మోడీ గుంటూరులో స‌భ పెట్టి త‌న‌ను తిట్ట‌డం నీచ‌మైన చ‌ర్య అని వ్యాఖ్యానించారు. మోడీకి మూడు రోజుల స‌మ‌యం ఇస్తున్నాన‌ని… ఆలోపు త‌ప్పు తెలుసుకుని చ‌ట్టంలో చెప్పిన‌వ‌న్నీ చేయాల‌న్నారు.

అప్పుడు తెలుగు ప్ర‌జ‌లు క్ష‌మించే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. ఒక‌వేళ మూడు రోజుల్లో మోడీ స్పందించ‌క‌పోతే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు బీజేపీని, మోడీని పూర్తిగా బ‌హిష్క‌రిస్తార‌ని హెచ్చ‌రించారు. తాము క‌న్నెర్ర చేస్తే ఏమవుతుందో మోడీ గుర్తు చేసుకోవాల‌న్నారు. అస‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌డ్డ మీద అడుగు పెట్టే హ‌క్కు మోడీకి ఎవ‌రిచ్చార‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.