ఢిల్లీ క్రికెట్లో గూండా రాజ్యం

  • చీఫ్ సెలెక్టర్ ను చితకబాదిన జూనియర్ క్రికెటర్లు
  • చీఫ్ సెలెక్టర్ అమిత్ భండారీపై రాడ్లు, హాకీ స్టిక్ లతో దాడి
  • అండర్ -23 ప్రాబబుల్స్ లో చోటు లేని ఆటగాళ్ల దౌర్జన్యం
  • తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైన ఢిల్లీ క్రికెట్ చీఫ్ సెలెక్టర్

క్రికెట్ అంటే మర్యాదస్తుల క్రీడ. క్రికెట్ ఆడే ఆటగాళ్లంతా మర్యాదగా మసలుకోవాలన్నది నిన్నటి మాట. నేటితరం క్రికెటర్లు క్రికెట్ మర్యాదతోనే ఆటలాడుకొంటున్నారు. క్రికెట్ మైదానాల సాక్షిగా… క్రికెట్ మర్యాదను మంటకలిపేస్తున్నారు.

దేశరాజధాని ఢిల్లీ నగరంలో…టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కొహ్లీ, మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, ఆల్ టైమ్ గ్రేట్ స్పిన్నర్ బిషిన్ సింగ్ బేడీ లాంటి ఎందరో గొప్పగొప్ప క్రికెటర్లను అందించిన ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తలదించుకొనే పరిస్థితి వచ్చింది. భారత క్రికెట్ కే తలమానికంగా నిలవాల్సిన ఢిల్లీ క్రికెట్ సంఘం ఆటగాళ్లు…మర్యాదస్తుల క్రీడకే అమర్యాద తీసుకువచ్చారు. 

అసలేం జరిగింది…?

డీడీసిఏ కమ్ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ లో …ఏటా …సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ జట్లతో పాటు…23 ఏళ్ల లోపు జట్లకు సైతం ఎంపిక పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. ఎంపిక కు ముందే.. సెలెక్షన్ ట్రైల్స్ లో పాల్గొనటానికి అర్హత సాధించిన ఆటగాళ్ల జాబితాలను సైతం…క్రికెట్ సంఘం కార్యాలయంలో ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది ఏటా సాధారణంగా జరుగుతూనే ఉంటుంది.

అయితే…2019 డీడీసీఏ అండర్ -23 ప్రాబబుల్స్ జాబితాను…ఢిల్లీ క్రికెట్ సంఘం సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్, మాజీ క్రికెటర్ అమిత్ భండారీ ప్రకటించారు. సెయింట్ స్టీఫెన్స్ గ్రౌండ్స్ వేదికగా నిర్వహించే సెలెక్షన ట్రైల్స్ లో పాల్గొనే వారి జాబితాను ప్రదర్శించారు.

వాగ్వాదం… ఆ పైన దాడి…

ఢిల్లీ లోని సెయింట్ స్టీఫెన్స్ గౌండ్స్ లో ట్రైల్స్ నిర్వహిస్తున్న సమయంలో…ప్రాబబుల్స్ జాబితాలో చోటు దక్కని ఇద్దరు యువక్రికెటర్లు వచ్చి….చీఫ్ సెలెక్టర్ అమిత్ భండారీ, టీమ్ మేనేజర్ శంకర్ సైనీతో వాగ్వాదానికి దిగారు. ప్రాబబుల్స్ జాబితాలో తమకు చోటు ఎందుకు కల్పించలేదంటూ నిలదీశారు.

ఆపైన ఎంపిక సంఘం చైర్మన్ పై భౌతికదాడికి దిగారు. ఆ వెంటనే 15 మంది యువకులు ఇనుపరాడ్లు, సైకిల్ చైన్లు, హాకీ స్టిక్ లతో దాడికి దిగారు. చీఫ్ సెలెక్టర్ చెప్పేది వినకుండా ఇష్టం వచ్చినట్లు బాదారు.

అక్కడే ఉన్న మిగిలిన సెలెక్టర్లు, టీమ్ సిబ్బంది అడ్డుకొని…తీవ్రగాయాలతో సొమ్మసిల్లి పడిపోయిన అమిత్ భండారీని.. సమీపంలోని సివిల్ లైన్స్ సంత్ పరమానంద ఆస్పత్రికి తరలించారు. తల, ముఖం, చెవి భాగాలలో తీవ్రగాయాలైన అమిత్ భండారీని ఐసీయులో ఉంచి మరీ చికిత్స అందిస్తున్నారు.

డీడీసీఏ సీరియస్….

తమ క్రికెట్ సంఘానికి చెందిన చీఫ్ సెలెక్టర్ పై…జూనియర్ క్రికెటర్లతో పాటు…గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయటాన్ని, విధ్వంసం సృష్టించడాన్ని…ఢిల్లీ క్రికెట్ సంఘం చైర్మన్ రజత్ శర్మ తీవ్రంగా పరిగణిస్తున్నారు.

క్రికెట్లో అరాచకాన్ని సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ కు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. దోషులను కఠినంగా శిక్షస్తామని.. జెంటిల్మన్ గేమ్ క్రికెట్లో రౌడీయిజాన్ని సహించేది లేదంటూ మండిపడ్డారు.

మొత్తం మీద భారత రాజధాని ఢిల్లీ క్రికెట్ సంఘం పుణ్యమా అంటూ క్రికెట్ అమర్యాదస్తుల క్రీడగా మారిపోయింది.