నారా బ్ర‌హ్మ‌ణికి లేఖ రాసినా ఫ‌లితం లేక‌… ఆత్మ‌హ‌త్య‌

హెరిటేజ్ కంపెనీ పంపిణీదారుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. కంపెనీ కార‌ణంగానే తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్టు లేఖ రాసి ప్రాణాలు తీసుకున్నాడు. ఇంటి వ‌ద్దే పురుగుల మందు తాగి చ‌నిపోయాడు.

ప్ర‌కాశం జిల్లా ముండ్ల‌మూరి మండ‌లం పోల‌వరానికి చెందిన గంగినేని హ‌రిబాబు టీడీపీ అభిమాని. హెరిటేజ్‌లో చాలా కాలంగా పంపిణిదారుడిగా ప‌నిచేస్తున్నారు. కంపెనీ పాలు, ఇత‌ర ప‌దార్దాల‌ను ఏజెంట్ల‌కు డిస్ట్రిబ్యూట్ చేస్తుండేవాడు. అయితే ఇటీవ‌ల హ‌ఠాత్తుగా హెరిటేజ్ సంస్థ గంగినేని హ‌రిబాబును పంపిణీదారుడిగా తొల‌గించింది. అద‌నంగా డిపాజిట్లు చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే పంపిణీదారుడిగా తొల‌గిస్తున్న‌ట్టు కంపెనీ నుంచి మెయిల్ వ‌చ్చింది.

దీంతో గంగినేని హ‌రిబాబు… నారా భువ‌నేశ్వ‌రి, నారా బ్రహ్మ‌ణిల‌కు లేఖ‌లు రాశారు. మిగిలిన కంపెనీల‌తో పోలిస్తే హెరిటేజ్‌లో క‌మిష‌న్ త‌క్కువ‌గా ఉంటుంద‌ని… అయినా స‌రే టీడీపీ మీద అభిమానంతో తాను చాలాకాలంగా ప‌నిచేస్తున్నాన‌ని వివ‌రించారు. ఇప్ప‌టికే తాను చాలా అప్పులు చేసుకున్నాన‌ని… హ‌ఠాత్తుగా పంపిణీదారుడిగా తొల‌గిస్తే త‌న కుటుంబం
దెబ్బ‌తింటుంద‌ని వాపోయాడు. అయినా స‌రే కంపెనీ నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు.

దీంతో మ‌న‌స్థాపం చెందిన హ‌రిబాబు సొంతూరుకు వెళ్లి అక్క‌డే పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ‌స‌భ్యులు గుర్తించి ఆస్ప‌త్రికి తీసుకెళ్లగా అప్ప‌టికే చ‌నిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. హ‌రిబాబుకు భార్య ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.