వింబుల్డన్ లో 9వ టైటిల్ కు ఎవర్ గ్రీన్ స్టార్ ఫెదరర్ గురి

  • 37 ఏళ్ల వయసులో 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు తహతహ
  • ఫెదరర్ కెరియర్ లో 8 వింబుల్డన్, 6 ఆస్ట్రేలియన్, 5 యూఎస్ టైటిల్స్

ప్రపంచ టెన్నిస్ ఎవర్ గ్రీన్ స్టార్, స్విస్ వండర్ రోజర్ ఫెదరర్…రికార్డుస్థాయిలో తొమ్మిదో వింబుల్డన్ టైటిల్ కు గురిపెట్టాడు. 37 ఏళ్ల వయసులోనూ ప్రపంచ మేటి టెన్నిస్ ఆటగాడిగా తన కెరియర్ ను కొనసాగిస్తున్న ఫెదరర్ ఇప్పటి వరకూ సాధించిన 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ లో అత్యధికంగా ఎనిమిది వింబుల్డన్ టైటిల్స్ ఉన్నాయి.

అయితే…వింబుల్డన్ టైటిల్ ను తొమ్మిదోసారి గెలుచుకోడానికి ప్రాక్టీస్ ప్రారంభించినట్లు… కూల్ కూల్ స్విస్ స్టార్ ఫెదరర్ ప్రకటించాడు. తన కెరియర్ లో ఇప్పటికే ఆరు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఐదు అమెరికన్ ఓపెన్ టైటిల్స్ సాధించిన ఫెదరర్ కు …ఓ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సైతం సాధించిన అరుదైన రికార్డు ఉంది.

310 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గా నిలిచిన ఫెదరర్…ఏటీపీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 7వ స్థానంలో కొనసాగుతున్నాడు.

2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ దశలోనే ఇంటిదారి పట్టిన ఫెదరర్…త్వరలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టోర్నీలలో సైతం తన అదృష్టం పరీక్షించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు.