ఆ ఎంపీ సీటుపై బాలయ్య అల్లుడి క‌న్ను !

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు టీడీపీ టికెట్లు రెడీ అవుతున్నాయి. అనంత‌పురం,క‌డ‌ప‌,నెల్లూరు ఎంపీ టికెట్లపై చంద్ర‌బాబు ఓ క్లారిటీ ఇచ్చేశారు. క‌డ‌ప ఎంపీగా ఆదినారాయ‌ణ‌రెడ్డి పోటీ చేస్తార‌నే విష‌యం తేలింది. అనంత‌పురం ఎంపీగా జేసీ దివాక‌ర్‌రెడ్డి కొడుకు జేసీ ప‌వ‌న్ పోటీ చేయొచ్చ‌ని తెలుస్తోంది. నెల్లూరు నుంచి బీదా మ‌స్తాన్ రావుకి అవ‌కాశం ఇస్తార‌ని అంటున్నారు. ఈ మూడు ఎంపీ టికెట్లు ఫైన‌ల్ అయిన‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌చారం న‌డుస్తోంది.

విశాఖ ఎంపీగా ఎవ‌రు పోటీ చేస్తార‌నేది ఇప్పుడు స‌స్పెన్స్‌గా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో పొత్తులో భాగంగా బీజేపీకి ఈ సీటు ఇచ్చారు. అక్క‌డి నుంచి కంభంపాటి హ‌రిబాబు ఎంపీగా గెలిచారు. అయితే ఈ సారి టీడీపీ త‌ర‌పున ఎవ‌రు బ‌రిలో ఉంటారనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంత‌కుముందు ఇక్క‌డ గీతం యూనివ‌ర్శిటీ అధినేత ఎంవివిఎస్ మూర్తి 1999లో ఎంపీగా గెలిచారు. ఆత‌ర్వాత 2004,2009లో ఆయ‌న ఓడిపోయారు.

అయితే ఈసారి ఎన్నిక‌ల్లో ఎంవివిఎస్ మూర్తి మ‌న‌వ‌డు భ‌ర‌త్‌ను పోటీ చేయించాల‌నే ఆలోచ‌న‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఉన్న‌ట్లు తెలుస్తోంది. నంద‌మూరి బాల‌కృష్ణ రెండో అల్లుడు భ‌ర‌త్. ఇటు బంధుత్వం ప్ర‌కారం కూడా క‌లిసి వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు ఎత్తులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

రాజ‌కీయాల్లో త‌న ఎంట్రీ ఖాయం అన్న విధంగా భ‌ర‌త్ కూడా ఢిల్లీలో జ‌రిగిన ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లో పాల్గొన్నారు. రాజ‌కీయంగా ఫోక‌స్ కావ‌డంపై దృష్టిపెట్టారు. మొత్తానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో భ‌ర‌త్ ఎంట్రీ ఖాయ‌మ‌ని తెలుస్తోంది. విశాఖ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.