ఇద్ద‌రు యువతుల అదృశ్యం… ఎమ్మెల్యే బోండా బ్యాచ్‌పై అనుమానం

విజ‌య‌వాడ‌లో ఇద్ద‌రు అమ్మాయిలు అదృశ్యం అయ్యారు. వారం రోజులుగా వారి ఆచూకీ లేదు. టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ వ‌ద్ద త‌మ క‌ష్టాలు చెప్పుకునేందుకు వెళ్ల‌గా అప్ప‌టి నుంచి అమ్మాయిలు గాయత్రి, సోని క‌నిపించ‌డం లేదు. దాంతో వారి త‌ల్లి కోటా జ్యోతి పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. మాచవ‌రం పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

త‌న కూతుర్ల ఆచూకీ క‌నిపెట్టాల‌ని వేడుకున్నారు. వారం రోజులుగా వారు క‌నిపించ‌డం లేద‌ని… ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వ‌స్తోంద‌ని జ్యోతి  క‌న్నీరుమున్నీర‌య్యారు.

భ‌ర్త నుంచి విడిపోయిన జ్యోతి గుణ‌ద‌ల‌లో నివాసం ఉంటోంది. కుట్టు మిష‌న్ కుట్టుకుంటూ ఇద్ద‌రు కూతుర్ల‌ను చదివించుకుంటోంది. ఆర్థికంగా వెనుక‌బ‌డిన త‌మ‌కు ప‌క్కా ఇల్లు మంజూరు చేయాల‌ని గ‌తేడాది ఎమ్మెల్యే బోండా ఉమా చుట్టూ తిరిగారు.

ఆ స‌మ‌యంలో ఇల్లు ఇప్పిస్తానంటూ ఇద్ద‌రు అమ్మాయిల‌ను బోండా ఉమా అనుచ‌రుడు కౌశిక్ తీసుకెళ్లాడు. ఎమ్మెల్యే ఆఫీస్‌లోనే అమ్మాయిల‌పై అత్యాచారం చేయ‌బోయాడు. దీనిపై గ‌తంలో పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా… న‌లుగురిని అరెస్ట్ కూడా చేశారు. అప్ప‌టి నుంచి త‌మ‌కు ఎమ్మెల్యే బోండా ఉమా వ‌ర్గం నుంచి వేధింపులు మ‌రింత పెరిగాయ‌ని యువ‌తుల త‌ల్లి జ్యోతి చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో వేధింపుల నుంచి రక్షించాల్సిందిగా కోరేందుకు చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ వ‌ద్ద‌కు త‌న కుమార్తెలు వెళ్లార‌ని… కానీ ఆ త‌ర్వాత ఆచూకీ లేకుండా పోయారని జ్యోతి పోలీసుల‌కు వివ‌రించారు.