చిన్నారిని నరికింది…. ఆపై రక్తం తాగింది

ఈ సంఘటన చూడకపోయినా తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇంతటి కౄరత్వం కలిగి ఉన్న వాళ్లు కూడా మనమధ్య ఉంటారా అన్న అనుమానం రాక మానదు. ఇంట్లో వాళ్లు పెట్టే మానసిక క్షోభను భరించలేక ఒక చిన్నారిని నరికి చంపి…. ఆ తర్వాత రక్తం తాగిందో మేనత్త.

పూర్తి వివరాల్లోకి వెళితే.. విశాఖ మన్యంలోని పెదబయలు మండలం లకేయపుట్టు గ్రామంలో వంతాల రస్మో అనే మహిళ నివసిస్తోంది. భర్తతో గొడవపడి కొంత కాలంగా పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో ఇక్కడ ఉండకు మీ అత్తగారింటికి వెళ్లిపోవాలని రస్మో తమ్ముడి భార్య, ఇతర కుటుంబ సభ్యులు నిత్యం ఆమెను వేధించసాగారు.

ఈ విషయమై పలుమార్లు వారి ఇంట్లో గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో తమ్ముడి భార్యపై కక్ష పెంచుకున్న రస్మో ఎలాగైనా వీరికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంది. ఆరేండ్ల వయసున్న తమ్ముడి కూతురుని వెంటబెట్టుకొని కట్టెల కోసమని సమీపంలోని కొండపైకి తీసుకొని వెళ్లింది. అక్కడకు చేరుకున్నాక కట్టెలు కొట్టే గొడ్డలితో చిన్నారిని నరికింది. ఆ తర్వాత ఆ రక్తాన్ని తాగింది. దీన్ని కొంత మంది గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టు మార్టం కోసం పంపించారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన రస్మోను అదుపులోనికి తీసుకొని కేసు నమోదు చేశారు. చిన్నారి తండ్రి ఏడాది క్రితమే మరణించాడు. తల్లి చిన్నారిని చూసుకుంటూ జీవిస్తోంది. ఇప్పుడా చిన్నారి మరణించడంతో విలవిలలాడుతోంది.