మళ్లీ మోడీయే ప్రధాని – ప్రశాంత్ కిషోర్

రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, నరేంద్ర మోడీనే రెండో సారి ప్రధాని అవుతారని ప్రముఖ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. ప్రశాంత్ కిషోర్ గతంలో మోడీకి ఎన్నికల సలహాదారుగా ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ పార్టీకి కూడా సలహాలు ఇస్తున్నారు.

కాగా, ఎన్డీయేలోని కీలకపార్టీ అయిన జేడీయూకి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రశాంత్ కిషోర్ నర్మగర్భంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నితీష్ కుమార్ ఎన్డీయేలో కీలకనేతగా ఉన్నా ఆయన ప్రధానమంత్రి రేసులో ఉండరని ప్రశాంత్ స్పష్టం చేశారు. బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోయినా నితీష్ కుమార్ మాత్రం ఆ రేసులో ఉండరన్నారు.

మరోవైపు బీజేపీతో పలు విషయాల్లో విభేదిస్తున్న శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రేను ఇటీవల ప్రశాంత్ కలిశారు. అయితే రానున్న ఎన్నికల్లో శివసేన తరపున ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడం కుదరదని తేల్చారు. మళ్ళీ మోడీయే ప్రధాని అవుతారని ప్రశాంత్ కిషోర్ సూచన ప్రాయంగా వెల్లడించడం రాజకీయ వర్గాలలో ఆసక్తి రేపుతోంది.