మ‌హిళా మంత్రి న‌డుముపై చేయి వేసిన పురుష మంత్రి

త్రిపుర‌లో యువ‌జ‌న శాఖ మంత్రి చేసిన ప‌ని దుమారం రేపుతోంది. ప్ర‌ధాని మోడీ, రాష్ట్ర ముఖ్య‌మంత్రి స‌మ‌క్షంలోనే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శాంత‌న చ‌క్మా న‌డుముపై చేయి వేశారు యువ‌జ‌న శాఖ మంత్రి మ‌నోజ్ కాంతి దేవ్.

ఈ వీడియో లైవ్‌లో ప్ర‌సారం కావ‌డంతో దుమారం రేగింది. మంత్రి మ‌నోజ్‌ను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇద్ద‌రు మంత్రులు బీజేపీ వారే కావ‌డంతో ఈ ఘ‌ట‌న‌పై మ‌హిళా మంత్రి నుంచి ఎలాంటి ఫిర్యాదు లేదు.

అగ‌ర్తాలో జరిగిన ఒక కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ… శిలాప‌ల‌కాల‌ను ఆవిష్క‌రిస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఒక‌వైపు ప్ర‌ధాని మోడీ, ముఖ్య‌మంత్రి ఉండ‌గా మ‌రో వైపు మ‌హిళా మంత్రి శాంతన చ‌క్మా, మ‌నోజ్ కాంతి నిల్చున్నారు. మ‌హిళా మంత్రికి కాస్త వెనుక‌గా ప‌క్క‌నే నిల‌బ‌డ్డ మ‌నోజ్ కాంతి…. మ‌హిళా మంత్రి న‌డుముపై చేయి వేశారు.

ఆమె సున్నితంగా అత‌డి చేయిని వెన‌క్కు నెట్టేసింది. ఈ వీడియో ప్ర‌సారం కావ‌డంతో ప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. వెంట‌నే మ‌నోజ్ కాంతిని అరెస్ట్ చేసి, మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ మాత్రం ఇది కావాల‌ని జ‌రిగిన సంఘ‌ట‌న కాద‌ని… వ్య‌క్తిత్వాల‌ను చంపే ప్ర‌య‌త్నాల‌ను విప‌క్షాలు మానుకోవాల‌ని సూచించింది. ఈ ఘ‌ట‌న‌పై
మాట్లాడేందుకు మంత్రి మ‌నోజ్ కాంతి మాత్రం నిరాక‌రిస్తున్నారు.