కేవీపీని వెళ్ల‌గొట్టే ప్ర‌య‌త్నంలో చంద్ర‌బాబు…

కాంగ్రెస్‌లో ఉన్న వైఎస్ అనుచ‌రుల‌ను పార్టీ నుంచి వెళ్ల‌గొట్టేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారా? ఇదే అనుమానం వ్య‌క్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామ‌చంద్ర‌రావు. మీడియాతో మాట్లాడిన ఆయ‌న …. త‌న‌కు పార్టీకి మ‌ధ్య అగాధం సృష్టించే ప‌ని చేయ‌వ‌ద్ద‌ని చంద్ర‌బాబుకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్యే విభేదాలు సృష్టించ‌డంలో చంద్ర‌బాబు దిట్ట అని వ్యాఖ్యానించారు కేవీపీ.

చంద్ర‌బాబుకు అల్జీమ‌ర్స్ వ్యాధి వ‌చ్చింద‌ని అందుకే ఉన్న‌ది లేన‌ట్టు…. లేనిది ఉన్న‌ట్టు…. మాట్లాడుతుంటార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. చంద్ర‌బాబుకు ఇప్పుడే ప్ర‌త్యేక హోదా గుర్తుకొచ్చింద‌ని ఎద్దేవా చేశారు. తాను రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం క‌ట్టుబ‌డి ఉన్న వ్య‌క్తిన‌ని… ఆ విష‌యం పార్టీకి కూడా తెలుస‌న్నారు. త‌న లాంటి చిన్న‌వాడిపై చంద్ర‌బాబు త‌న కుట్ర‌ల‌ను ప్ర‌యోగించ‌వ‌ద్ద‌న్నారు.

త‌న‌ను చాలా మంది ప్ర‌లోభ‌పెట్టినా చిన్న‌ప్ప‌టి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నాన‌ని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ప్ర‌ధాని అయ్యే వ‌ర‌కు క్రియాశీల‌క రాజ‌కీయాల్లోనే ఉంటాన‌న్నారు. ప‌చ్చి అబ‌ద్దాల‌ను కూడా నిజాయితీప‌రుడి త‌ర‌హాలో చెప్ప‌డంలో చంద్ర‌బాబు రికార్డు సృష్టించార‌న్నారు.

చంద్ర‌బాబు హ‌ఠాత్తుగా ప్ర‌త్యేక హోదా అంటూ ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తున్నార‌ని… దాన్ని త‌గ్గించుకోవాల‌న్నారు. త‌న‌కు, కాంగ్రెస్‌కు మ‌ధ్య అపోహ‌లు సృష్టించేందుకు చంద్ర‌బాబు ఎంత‌గా ప్ర‌య‌త్నించినా అవి స‌ఫ‌లం అయ్యే అవ‌కాశ‌మే లేద‌న్నారు కేవీపీ.