ఇంత సాహసం అవసరమా కాజల్..?

భానుమతి, సావిత్రి జమానా నుంచి నిన్నటి విజయ నిర్మల, విజయశాంతి వరకు ఏ హీరోయిన్ ను చూసినా నిర్మాతగా క్లిక్ అయిన దాఖలాలు లేవు. ఒకప్పుడు ఆల్ రౌండర్స్ గా పేరుతెచ్చుకున్న భానుమతి కూడా ఒక దశలో నిర్మాతగా మారి తప్పుచేశానని ప్రకటించారు. దాదాపు ఇదే అభిప్రాయాన్ని సావిత్రి కూడా అప్పట్లో వ్యక్తంచేశారు.

వీళ్లతో పాటు ఇతరుల్ని నమ్మి నిర్మాతలుగా నష్టాలు తెచ్చుకున్న నిర్మాతలు కూడా చాలామంది ఉన్నారు. పరిశ్రమలో ఇన్ని అనుభవాలు ఉన్నప్పటికీ కొంతమంది హీరోయిన్లు నిర్మాతలుగా మారుతూనే ఉన్నారు. చేతులు కాల్చుకుంటూనే ఉన్నారు. ఇప్పుడీ లిస్ట్ లో కాజల్ కూడా చేరింది.

అవును.. కేఏ వెంచర్స్ బ్యానర్ పై నిర్మాతగా మారే ఆలోచనలో కాజల్ ఉన్నట్టు తెలుస్తోంది. తన ఫ్రెండ్ తమన్నను కూడా భాగస్వామిగా చేసుకొని ఓ సినిమా నిర్మించాలని భావిస్తోందట కాజల్. ఇదే కనుక నిజమైతే కాజల్ చాలా పెద్ద సాహసమే చేస్తోందని చెప్పాలి.

గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘అ!’ అనే సినిమా చేసింది కాజల్. ఇప్పుడు మరోసారి అతడి దర్శకత్వంలో నటిస్తూ, సొంతంగా సినిమా నిర్మించాలని అనుకుంటోందట. ఎలాంటి హంగామా లేకుండా బ్యాగ్ గ్రౌండ్ వర్క్ పూర్తిచేసి, ఓ మంచి రోజు చూసి తన బ్యానర్ తో పాటు మూవీ డీటెయిల్స్ బయటపెట్టాలని అనుకుంటోంది కాజల్.