పెళ్లికబురు మోసుకొచ్చిన ప్రేమ జంట

మొన్నటివరకు పుకార్లు మాత్రమే. కానీ ఇప్పుడు ఆ రూమర్లు నిజమయ్యాయి. హీరో ఆర్య, హీరోయిన్ సాయేషా పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ మేటర్ ను ఎక్స్ క్లూజివ్ గా బయటపెట్టాడు ఆర్య. నిజానికి వాలంటైన్స్ డే సందర్భంగా వీళ్లు తమ ప్రేమను బయటపెడతారని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఆర్య మాత్రం తామిద్దరం ప్రేమించుకుంటున్నామనే విషయంతో పాటు ఏకంగా పెళ్లి వార్తను కూడా మోసుకొచ్చాడు.

అవును.. పెద్దల ఆశీర్వాదంతో వచ్చేనెలలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది ఈ జంట. ఆ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనే విషయాన్ని మాత్రం ఇంకా బయటపెట్టలేదు. సెలబ్రిటీస్ అంతా ఈమధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు అందరితో కలిసి ఏదైనా పొరుగు రాష్ట్రమో, మరో దేశమో వెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఆర్య-సాయేషా మాత్రం ఇండియాలోనే పెళ్లి చేసుకుంటారని టాక్

తెలుగులో సూపర్ హిట్ అయిన భలే భలే మగాడివోయ్ సినిమాకు రీమేక్ గా తమిళ్ లో గజనీకాంత్ అనే మూవీ వచ్చింది. ఆ సినిమాతోనే ఆర్య, సాయేషా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, అదిప్పుడు పెళ్లికి దారితీసింది.