పాత‌ ఫోటోల‌తో ప్రియాంక గాంధీ తొలి ర్యాలీ న‌వ్వుల‌పాలు..

రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన త‌ర్వాత ప్రియాంక గాంధీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ల‌క్నోలో సోద‌రుడు రాహుల్‌తో క‌లిసి ర్యాలీ నిర్వ‌హించారు. ర్యాలీ విజ‌య‌వంత‌మైంద‌ని ఆ త‌ర్వాత కాంగ్రెస్ ప్ర‌క‌టించుకుంది. ఇసుకేస్తే నేల రాల‌నంత జ‌నం వ‌చ్చారంటూ కొన్ని ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా తిప్పింది.

కాంగ్రెస్ కీల‌క నేత‌లు కూడా త‌లోచేయి వేసి వారి వారి సోష‌ల్ మీడియా ఖాతాల్లో ఫోటోల‌ను షేర్ చేశారు. ఆ ఫోటోల్లో ఒక ఫోటో విప‌రీతంగా పావుల‌ర్ అయింది. ర్యాలీ సంద‌ర్భంగా కిలోమీట‌ర్ల మేర రోడ్ల‌న్ని జ‌న‌సంద్ర‌మైన‌ట్టుగా ఒక ఫోటోలో ఉంది. దాన్ని కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి ప్రియాంక చ‌తుర్వేది కూడా ఫేర్ చేశారు.

ఇదీ ప్రియాంక‌కు ఉన్న ఫాలోయింగ్ అంటూ కామెంట్లు రాశారు కాంగ్రెస్ నేత‌లు. కానీ వారు షేర్ చేసిన ఫోటో ఇప్ప‌టిది కాద‌ని తేలిపోయింది. ర్యాలీకి జ‌నం భారీగా వ‌చ్చారంటూ కాంగ్రెస్ నేత‌లు షేర్ చేసిన ఫోటో అస‌లు ల‌క్నోకు సంబంధించిన‌ది కాదు. మ‌న తెలంగాణ‌కు చెందిన‌ది.

2018 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో మాజీ క్రికెట‌ర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ పాల్గొన్న‌ ప్ర‌చార ర్యాలీకి సంబంధించిన ఫోటో. ఈ ఫోటోను అప్ప‌ట్లో స్వ‌యంగా అజారే త‌న ట్వీట్ట‌ర్‌లో పోస్టు చేశారు. దాన్ని ఎలా సేక‌రించారో గానీ కాంగ్రెస్ నేత‌లు… ఆ ఫోటోను ప్రియాంక గాంధీ ల‌క్నో ర్యాలీకి చెందిన‌దిగా ప్ర‌చారం చేశారు.

అయితే ఈ ఫోటోలో రోడ్ల ప‌క్క‌న ఉన్న షాపుల బోర్డుల‌పై తెలుగు అక్ష‌రాలు కూడా ఉండ‌డంతో కాంగ్రెస్ నేత‌ల ప్ర‌చారం న‌వ్వుల‌పాల‌వ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌లేదు.దీంతో నాలుక క‌రుచుకున్న ప్రియాంక చ‌తుర్వేది ఆ ఫోటోను తొల‌గించారు. అయితే ఇప్ప‌టికీ కాంగ్రెస్ చోటామోటా నేత‌ల సోష‌ల్ మీడియా ఖాతాల్లో ఈ ఫోటో  అలాగే ద‌ర్శ‌న‌మిస్తోంది.